జగన్ కి రాజకీయం కొత్త కాదు. ఆయన ఇంట్లోనే రాజకీయం ఉంది. పైగా ఆయన గత పదిహేనేళ్లుగా పాలిటిక్స్ లో ఉన్నారు. అయినా సరే ఏదో కొత్తగా రాజకీయాలు చేయాలని ఎందుకు అనుకున్నారో అర్థం కాదు. రాజకీయాల్లో ఎప్పుడు అవకాశవాదానికే పెద్దపీట.
ఈ విషయం మరిచి తాను పదవి ఇస్తే నమ్ముకొని ఉంటారు అని అనుకుంటే పొరపాటే. ఈ విషయమై జగన్ కి ఎన్నో సార్లు ఎన్నో సంఘటనలు చెబుతున్నా ఇంకా తత్వం అర్థం కాలేదా అన్నది చర్చగా ఉంది. జగన్ తన రెక్కల కష్టంతో 2014లో 67 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుంటే వారిలో 23 మందిని టీడీపీ లాగేసింది. జగన్ మాత్రం తాను అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి పనులు చేయనని ఒట్టు పెట్టారు. టీడీపీ నుంచి నలుగురు, జనసేన నుంచి అనుబంధంగా కూర్చున్నా వారికి ఏనాడు పార్టీ కండువా కప్పలేదు జగన్.
మండలిలో బలం లేకపోయినా ఎవర్నీ ఆకర్షించాలనే ప్రయత్నం నాడు చేయలేదు. కానీ మూడేళ్ల తర్వాత వైసీపీ బలం పెరిగింది. ఇదే వైసీపీకి పెద్ద దిక్కుగా మారింది. వీరిని చూసుకొని జగన్ ధైర్యంగా ఉన్నారు. కానీ సరిగ్గా ఇక్కడే అవసరం, అవకాశ వాదం కలిసి రాజకీయం చేస్తాయని జగన్ ఊహించలేకపోయారు.
రాజకీయం ఇలానే ఉంటుంది. ఇది ఒక ఆట. అవతల వారు ఇదే నియమంతో ఆడుతుంటే ఇవతల వారు కూడా అలానే ఆడాలి. లేదు వేరే పద్ధతి అంటే తల బొప్పి కడుతుంది. ఏపీలో జరగుతుంది ఇదే. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తన సొంత సామాజిక వర్గాన్నే నిర్లక్ష్యం చేశారన్న విమర్శలు ఉన్నాయి. ఇదే సమయంలో సామాజిక సమీకరణాల పేరుతో కొత్త ప్రయోగాలు చేశారు.
విధేయతకు పెద్ద పీట అని కిందరిని అందలాలు ఇచ్చారు. మరికొందరికి కాంబినేషన్ బాగుంటుంది అని ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు వారంతా జగన్ కు వెన్నుపోటు పొడిచి పార్టీ మారుతున్నారు. జగన్ వారికి ఏమీ తక్కువ చేయలేదు. ఆ సంగతి వారికి కూడా తెలుసు. ఇందులో వారిని తప్పు పట్టాల్సిన పని లేదు. ఎందుకంటే ఇది రాజకీయం. జగన్ ఇది అర్థం చేసుకొని రాజకీయం చేస్తే మేలు అని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.