`మా ఇంటికి హంత‌కుడు వ‌చ్చినా ఫ‌ర్వాలేదు..కానీ, కాళ్లు క‌డుక్కుని ఇంట్లోకి రావాలి!`- అన్న‌ట్టుగా ఉంది.. ఏపీ బీజేపీ వైఖ‌రి. రాష్ట్రంలో ఇప్పుడు రాజ‌కీయ నేత‌ల జంపింగుల ప‌ర్వం కొన‌సాగుతోంది. ఈ క్ర‌మంలో త‌మ‌కు అనుకూలంగా ఉన్న పార్టీల్లోకి నాయ‌కులు జంప్ చేస్తున్నారు. ఇక‌, ఇత‌ర కేసుల్లో ఉన్న‌వారు.. క‌ర‌డుగ‌ట్టిన నేర‌స్తులు కూడా.. ఇప్పుడు పార్టీల పంచ‌న చేరేందుకు రెడీ అయ్యారు. వీరిలో నూ ఎర్ర‌చంద‌నం స్మ‌గ్ల‌ర్‌.. కొల్లం గంగి రెడ్డి ఇప్ప‌టికే బీజేపీ వైపు చూస్తున్నారు.


ఇలాంటి కీల‌క స‌మ‌యంలో బీజేపీ ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగుతుంద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే.. ఈ చేరిక‌ల‌పై బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షురాలు.. పురందేశ్వ‌రి ఆలోచ‌న మ‌రోవిధంగా ఉంది. పైన చెప్పుకొన్న‌ట్టు.. ఎవ‌రు ఎలాంటి వారైనా ఫ‌ర్వాలేదు.. మా పార్టీలోకి రావొచ్చు. కానీ, బీజేపీకి అంటూ కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. వాటిని పాటిస్తే.. చాలు, వాటిని ఫాలో అయితే చాలు! అని మాత్రం పురందేశ్వ‌రి తేల్చి చెబుతున్నారు. అంటే.. ఎలాంటి వారైనా రావొచ్చ‌ని ఆమె గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్నారు.


ప్ర‌స్తుతం వైసీపీనుంచి న‌లుగురు రాజ్య‌స‌భ స‌భ్యులు బీజేపీ వైపు చూస్తున్నార‌ని.. ఢిల్లీఓ మంత‌నాలు కూడా సాగుతున్నాయ‌న్న చ‌ర్చ‌ల నేప‌థ్యంలో పురందేశ్వ‌రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి. అయితే.. బీజేపీ వ్య‌వ‌హార శైలి ఆది నుంచి కూడా ఇలానే ఉంది. పార్టీలోకి చేర‌క‌ముందు.. వివిధ కేసుల్లో చిక్కుకున్న వారు.. పార్టీలో కండువా క‌ప్పుకోగానే పునీతులైన వారు ఉన్నారు. మ‌హారాష్ట్ర నుంచి ఒడిశా వ‌ర‌కు.. త‌మిళ‌నాడు నుంచి కేర‌ళ వ‌ర‌కు.. ఎంతో మంది ఇలా పునీతులయ్యారు.


ఏపీ, తెలంగాణ‌ల్లోనూ ఇలాంటివారు ఉన్నారు. ప్ర‌స్తుతం ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా కూడా బీజేపీ త‌ర‌ఫున గెలిచారు. వారి పేర్లు చెబితే బాగుండ‌దు. కానీ, బీజేపీ వైఖ‌రిని మాత్రం ప్ర‌శ్నించాల్సిందే. అదే ప‌ని కాంగ్రెస్ చేస్తే.. మాత్రం విరుచుకుప‌డే బీజేపీ.. ఇప్పుడు ప‌క్కా స్మ‌గ్ల‌ర్‌గా ... ద‌క్షిణాది రాష్ట్రాల్లోని పోలీసుల రికార్డుల్లో పేరుమోసిన గంగిరెడ్డిని కూడా.. చేర్చుకునేందుకు రెడీ కావ‌డం.. ఆ పార్టీ దిగ‌జారుడు రాజ‌కీయాల‌కు పరాకాష్ఠ‌గా మారాయి. దీనికి పురందేశ్వ‌రి కూడా అతీతులు కాద‌న్న విష‌యం స్ప‌ష్టం.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp