ఇద్దరూ అన్నదమ్ముళ్లా పెరిగారు. ఒకరి మేలు ఒకరు కోరుకున్నారు. ఏపీలో జగన్ గెలవాలని 2014 నుంచే కేసీఆర్ కోరుకున్నారు. కానీ అది 2019లో నెరవేరింది. ఇక 2024లోను వైసీపీయే అధికారంలోకి వస్తుందని అక్కడ కేసీఆర్, కేటీఆర్ జోస్యాలు చెప్పారు. కానీ జరిగింది వేరు.
మొత్తానికి 2019లో ఏపీలో జగన్, రెండోసారి తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి వచ్చాక భాయీ, భాయీ అన్నట్లు మెలిగారు. ఇలా కొనసాగిన బంధం ఓటమిలోను కలిసే ఉంది. ఇద్దరు కొన్ని నెలల తేడాతో ఓటమి చెందారు. సిట్టింగులకు అన్ని సీట్లు ఇచ్చి కేసీఆర్ ఓడితే.. సిట్టింగులను పెద్ద ఎత్తున మార్చి జగన్ ఘెర పరాజయాన్ని మూట గట్టుకున్నారు. ఎవరు ఏం చేసినా ఫలితం మాత్రం ఒక్కటిగానే వచ్చింది.
ఇవన్నీ ఇలా ఉంటే ఓటమి తర్వాత కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ అనేక ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ఆ పార్టీలో ఉన్నవారు. కేసీఆర్ అంటే విధేయత చూపించిన వారు అంతా అధికార కాంగ్రెస్ వైపు పరుగులు తీశారు. దీనికి తోడు లోక్ సభ ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు కూడా దక్కించుకోవడంలో ఆ పార్టీ చతికిల పడింది. ఇక బీఆర్ఎస్ ఏ విధంగా ముందుకు సాగుతుంది అనే ఒక చర్చ ప్రస్తుతానికి అయితే ఉంది. ఏం జరిగిన నష్ట నివారణ చర్యలు కేసీఆర్ తీసుకోవడం లేదు అనే వాదన అయితే ఉంది.
ఇక ఏపీలో బుజ్జగించిన వెళ్లిపోయేవారు వెళ్లిపోతారు అనే భావనలో జగన్ ఉన్నట్లు కనిపిస్తోంది. వైసీపీ వీర విధేయులు కూడా పార్టీలు మారుతున్నారు. ఇలా చూసుకుంటే విజయాల్లోనే కాదు.. ఇబ్బందుల్లోను వైసీపీకి, బీఆర్ఎస్ కు భావ సారూప్యత ఉంది. ఇక్కడ ఈ రెండు పార్టీల పుట్టుక నడక ఒకానొక టైంలో ఆ పార్టీలు చూపిన తీవ్ర రాజకీయ ప్రభావం కూడా ఇంచుమించు ఒకటే. బీఆర్ఎస్ ఒక ఎమోషన్ నుంచి పుడితే.. వైఎస్సార్ పార్టీ భావోద్వేగం నుంచి వచ్చింది. ఇప్పుడు ఈ రెండు పార్టీలు ఉనికి పోరాటం చేస్తున్నాయనే అంటున్నారు. ఈ రెండు పార్టీలకు కొత్త నినాదం కావాలి. కొత్త రాజకీయ విధానం కావాలి.