రాజ‌కీయాల్లో కొంద‌రు నాయ‌కులు.. చేయాల్సింది చేసేస్తారు. కానీ, ఎక్క‌డా బ‌య‌ట ప‌డ‌రు. ఇప్పుడు వైసీపీలోనూ ఇదే జ‌రుగుతోంద‌న్న‌ది టాక్‌. వైసీపీలో సీనియర్ నాయకుడిగా జాతీయస్థాయిలో రాజకీయాలు చ‌క్కబెడుతున్న విజయ్ సాయి రెడ్డి వైపే ఇప్పుడు అందరూ అనుమానంగా చూస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు నాయకుల జంపింగ్‌ల‌ వెనుక ఆయన హస్తం ఉందనేది మెజారిటీ నాయకుల అభిప్రాయం. వాస్తవానికి విజయసాయిరెడ్డి పార్టీ మారిపోతాడని ఒక ప్రచారం అయితే తెర మీదకు వచ్చింది.


దీంతో వెంటనే ఆయన స్పందించి నేను వైసీపీలోనే ఉంటాను జగన్ వెనకే నడుస్తానని చెప్పుకొచ్చారు. ఓకే ఆయన ఉండొచ్చు, జగన్ వెనకే నడవొచ్చు. కానీ అంతర్గతంగా చూసుకుంటే ఆయనకు ఉండే వ్యాపారాలు లేదా ఆయన కొత్తగా ఛానల్ పెట్టాలని భావించిన నేపథ్యంలో కేంద్రం నుంచి ఆయనకు సహకారం చాలా అవసరం. ఈ క్రమంలో ఆయన పరోక్షంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి సహకరించే అవకాశం లేదని ఎవరూ చెప్పలేరు. అందుకే వ్యూహాత్మకంగా వైసీపీలో చిచ్చు పెడుతున్నారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.


ఇది ఒకరిద్దరు నాయకులు చెబుతున్న మాటయితే తీసి పక్కన పడేయ‌వచ్చు. కానీ, మెజారిటీ నాయకులు సీనియర్ నాయకులు కూడా విజయసాయిరెడ్డి వైపు వేళ్లు చూపిస్తున్నారు. రాజకీయాల్లో ప్రధాన స్థాయిలో విజయసాయిరెడ్డి ఉండడం మరీ ముఖ్యంగా రాజ్యసభ సభ్యులపై ఆయనకు గ‌ట్టి పట్టుకున్న నేపథంలో ఈ చ‌ర్చ‌ల‌ పర్వం సాగుతోంది. అయితే.. ఆయ‌న ఇలా చేస్తున్నార‌న‌డానికి ఆధారాలు లేకపోయినా జరుగుతున్న పరిణామాలు నాయకులు తీసుకుంటున్న నిర్ణయాలను గమనిస్తే మాత్రం సాయిరెడ్డి కనసన్న ల‌లోనే జరుగుతున్నదని వైసీపీలోని సీనియర్ నాయకులు చెప్తున్నారు.


అంతర్గత సంభాషణల్లో వెలువ‌డుతున్న వ్యాఖ్యలను బట్టి  ఇదే తెలుస్తోంది. సాయి రెడ్డికి ఢిల్లీలో రాజకీయ మంత్రాంగం చేయగలిగే నేర్పు ఎంతో ఉన్న విషయం తెలిసిందే. పది సంవత్సరాలుగా ఆయన ఢిల్లీని మేనేజ్ చేస్తూ వస్తున్నారని కూడా అందరికీ తెలుసు. జగన్ పై కేసులు కావచ్చు తనపై కేసులు కావచ్చు ఇతరత్రా అంశాలు కావచ్చు ఏదైనా రాజకీయాలను సాయిరెడ్డి ప్రభావితం చేస్తున్నారు.


కాబట్టి ఇప్పుడు బిజెపికి ఇతోధికంగా దోహదపడటంలో సాయి రెడ్డి పాత్ర ఉందని ఇదే సమయంలో ఆయ‌న‌ రాజ్యసభలో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారనేది మెజారిటీ వైసిపి నాయకులు అంచనా. ఈ క్రమంలో అధినేత జగన్ కూడా సాయి రెడ్డి పై సందేహాలు వ్య‌క్తం చేస్తున్నట్టు సమాచారం. అందుకే ఆయన వెంట‌నే జగన్తోనే ఉంటాను పార్టీలోనే కొనసాగుతానని మెసేజ్ పెట్టినట్టు తెలుస్తుంది. ఏదైనా దీని వెనక వాస్తవాలు వెలుగులోకి రావడానికి కొంత టైం అయితే పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: