వైసీపీ నుంచి వరుసపెట్టి కీలక నేతలు బయటకు వెళ్లిపోతున్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చివరకు రాజ్యసభ సభ్యులు జగన్‌కు అత్యంత సన్నిహితంగా ఉన్న నేతలు కూడా ఇప్పుడు వైసీపీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. చాలామందితో జగన్ మాట్లాడేందుకు కూడా ఇష్టపడటం లేదు. ఉండే వాళ్ళు ఉంటారు, పోయేవాళ్ళు పోతారు అన్నట్టుగా ఉంది. జగన్‌కు ముందు నుంచి ఇగో బాగా ఎక్కువ. తాను ఎవరిని అడిగి బతిమిలాడాలని అనుకునే మనస్తత్వం జగన్ది కాదు. అయితే వరుస‌పెట్టి కీలక నేతలు అందరూ వెళ్ళిపోతూ ఉండడంతో.. జగన్ కాస్త వెనక్కు తగ్గి ఇప్పుడు పార్టీ మారాలి అనుకుంటున్న నేతలకు ఫోన్లు చేసి స్వయంగా బతిమిలాడి బుజ్జగించుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది అంటున్నారు.


తాజాగా రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబురావుతో మాజీ ముఖ్యమంత్రి జగన్ మాట్లాడినట్టు వైసిపి వర్గాలు చెబుతున్నాయి. వైసిపిని వీడే రాజ్యసభ సభ్యులలో గొల్ల బాబురావు పేరు ప్రముఖంగా వినిపించింది. వాస్తవానికి 2019 ఎన్నికలలో పాయకరావుపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బాబురావు.. మంత్రి పదవి వస్తుందని అనుకున్నారు. అయితే జగన్ ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు. మొన్న ఎన్నికలలో టిక్కెట్ కూడా ఇవ్వలేదు. అయితే జగన్ బాబురావుకు రాజ్యసభ కేటాయించారు. మొన్న ఎమ్మెల్యే సీటు ఇవ్వకపోవడంతో పాటు.. రాజ్యసభకు పంపి తనను డ‌మ్మిని చేశారన్న ఆవేదన బాబురావుకు ఉంది. అందుకే ఆయనకు ఇప్పుడు పార్టీ మారిపోవాలని ప్లాన్ చేసుకున్నారు.


జగన్ బతిమిలాడి బుజ్జగించడంతోపాటు.. బాబురావు కుమారుడి రాజకీయ భవిష్యత్తుపై హామీ ఇవ్వడంతో.. మెత్తబడినట్టు తెలుస్తోంది. జగన్‌ను కలిసిన.. జగన్‌తో మాట్లాడిన తర్వాత బాబురావు మీడియా ముందుకు వచ్చారు. వైఎస్ఆర్ కుటుంబంతో తనకు విడదీయలేని బంధం ఉందన్నారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు వైయస్ జగన్ రెడ్డి వెంటే ఉంటానని అన్నారు. వాస్తవానికి వైఎస్ఆర్ కు గొల్ల బాబురావు పరమ భక్తుడు. అయితే జగన్‌తో.. బాబురావుకు అంత ఎమోషనల్ అటాచ్మెంట్ లేదు. అయితే ఇప్పుడు జగన్ నేరుగా మాట్లాడడంతో.. బాబురావు కాస్త మెత్తబడ్డారని.. ఆయన పార్టీ వీడే విషయం ఆలోచన మానుకున్నారని తెలుస్తోంది. ఏది ఏమైనా జగన్ కాస్త ఒక మెట్టు దిగి బతిమిలాడుకుని బుజ్జగిస్తే తప్ప ఎవరు పార్టీలో మిగిలే పరిస్థితి అయితే లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: