మొన్నటి ఎన్నికల్లో పుట్టపర్తి ఎమ్మెల్యేగా పల్లె సింధూర రెడ్డి ఎన్నికయ్యారు. కానీ ఆమె పేరుకే ఎమ్మెల్యే. పెత్తనం అంతా మామ పల్లె రఘునాథరెడ్డిది. ఎమ్మెల్యే సింధూర రెడ్డి పాల్గొనే అధికారిక కార్యక్రమాలన్నింటిలోనూ పల్లె రఘునాథరెడ్డి పాల్గొంటున్నారట. ఎమ్మెల్యేకు తోడుగా వెళ్తే తప్పులేదు కానీ స్టేజ్ మీద ఎమ్మెల్యే పక్కన కూర్చొని అధికారులను ఆదేశిస్తూ పెత్తనం చెలాయిస్తున్నారట. వృద్ధాప్య పింఛన్ పంపిణీ మొదలు అధికారిక కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు, ఉపాధి హామీ ఫీల్డ్ ఉద్యోగులకు సంబంధించిన బహిరంగ సభలలోను పల్లె రఘునాథరెడ్డి పాల్గొంటున్నారట.


చివరకు కలెక్టరేట్లలో రివ్యూ మీటింగ్ లకు హాజరవడం విమర్శలకు దారితీస్తోంది. కార్యక్రమాలలో పాల్గొనడమే కాకుండా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ నియామకాలలో తల దూర్చుతున్నారట. మధ్యాహ్న భోజన ఏజెన్సీలో మార్పు, సహాయకులు, ఆయాల మార్పు, మున్సిపాలిటీ ఉద్యోగుల ట్రాన్స్ఫర్లు, రేషన్ డీలర్ల నియామకం వరకు అనేక వ్యవహారాల్లో జిల్లా కలెక్టర్లకు, ఎస్పీలకు ఫోన్లు చేయడం, ప్రభుత్వ కార్యక్రమాల్లో తలదూర్చుతూ అధికారులకు ఆదేశాలు ఇస్తూ అన్ని పనులను పల్లె రఘునాథరెడ్డి చేస్తున్నారట.


దీంతో ఎమ్మెల్యే సొంత నిర్ణయాలు తీసుకోలేకపోతుందని ప్రజలు భావిస్తున్నారట. పల్లె సింధూర రెడ్డి విద్యావంతురాలు. కేరళ మాజీ డీజీపీ కూతురు. పల్లె రఘునాథరెడ్డి కోడలు. ఆమెకు రాజకీయాల్లోకి రావాలని ఆసక్తి లేకపోయినప్పటికీ పరిస్థితుల ప్రభావం వల్ల అనుకోకుండానే రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందట. దానికి గల కారణం పార్టీ నిర్ణయం. మొన్న జరిగిన ఎన్నికల్లో యువత విద్యావంతులకు టీడీపీ ప్రాధాన్యత ఇచ్చింది.


ఆ క్రమంలో పుట్టపర్తిలోను మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డిని కాదని వేరే అభ్యర్థిని నిలబెట్టాలని చంద్రబాబు భావించారట. అయితే తనకు కాకపోయినా తన కుటుంబంలో ఎవరో ఒకరికి టికెట్ కేటాయించాలని చంద్రబాబును పల్లె రఘునాథరెడ్డి కోరారట.   దీంతో సింధూర రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. అయితే.. సింధూర రెడ్డి  ఎమ్మెల్యేగా విజయం సాధించినప్పటికీ... పల్లె రఘునాథరెడ్డి అంతా నడిపిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: