వైసీపీ అధినేత వైఎస్ జగన్ కి ఇటీవల కాలంలో రాజ్యసభ సభ్యుల రాజీనామాలు తలనొప్పులు కలిగించాయి. సైలెంట్ గా ఇద్దరు ఎంపీలు రాజీనామాలు చేశారు. అందులో ఒకరు వైఎస్సార్ కుటుంబం నుంచి వీర విధేయుడిగా ఉన్న మోపిదేవి వెంకటరమణ. ఆయన రాజీనామాను అసలు ఎవరూ ఊహించలేదు.
దీంతో వైఎస్సార్ విధేయులు ఒక్కొక్కరుగా వీడుతున్నారు అనే సందేశం జనాల్లోకి వెళ్తోంది. ఈ నేపథ్యంలో మరింత మంది ఎంపీలు జంప్ చేస్తారు అనే ప్రచారం సైతం ఊపందుకుంది. దీంతో జగన్ కి వర్షాకాలంలో ఎండాకాలంలా మారింది. ఏకంగా ఫలానా వారు గోడ దూకి వెళ్తారు అనే లిస్ట్ మెయిన్ స్ర్టీఆమ్ మీడియాతో పాటు సోషల్ మీడియాలోను వైరల్ అయింది. దీంతో వైసీపీ లో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు.
ఈ క్రమంలో ఎవరైతే పార్టీ మారుతారు అనే ప్రచారం విస్తృతంగా సాగిందో వారే మీడియా ముందుకు వచ్చి తాము వైసీపీతోనే ఉంటామని స్పష్టం చేశారు. దీంతో జగన్ ఊపిరి పీల్చుకున్నారు. వరసగా ఆళ్ల ఆయోధ్య రామిరెడ్డి, ఆర్ కృష్ణయ్య, పిల్లి సుభాష్ చంద్రబోస్, మేడా రఘునాథరెడ్డిలు జగన్ తోనే తమ ప్రయాణం అని చెప్పేశారు. దీంతో వైసీపీ కి ప్రస్తుతానికి పెను తుపాన్ తప్పినట్లయింది.
ఇక గత కొద్ది రోజులుగా మారు మోగుతున్న మరో ఎంపీ పేరు గొల్ల బాబురావు. ఆయన కూడా తాజాగా కీలక ప్రకటన చేశారు. తాను వైఎస్సార్ వల్లే అరంగేట్రం చేశానని… వైఎస్సార్ కుటుంబానికి విధేయుడిగా ఉంటానని ప్రకటించారు. తాను పార్టీ ఎందుకు మారుతాను అని ఎదురు ప్రశ్నించారు. దీంతో వైసీపీలో ఒకింత ప్రశాంతత నెలకొంది.
మొత్తానికి వైసీపీ నుంచి ఇద్దరు ఎంపీలు మాత్రమే బయటకు వెళ్లారు. మిగతా తొమ్మిది మంది వైసీపీతోనే ఉంటారు అనే స్పష్టత వచ్చింది. ఈ ప్రకటనతో జగన్ ఫుల్ రిలాక్స్ మూడ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ నుంచి ఎంపీలను లాగాలని చూసిన వారికి తాజా ప్రయత్నం పూర్తి స్థాయి విజయం అయితే లభించలేదు అని అంటున్నారు.