ప్రధాని మోదీ పాలనలో కమ్యూనికేషన్ రంగం ఓ తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించింది. ఒ సరికొత్త విప్లవాన్ని సృష్టించింది. తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు, ప్రాజెక్టులు, ఇతర కార్యకలాపాలన్నీ కూడా దేశ ప్రజలకు చేరవేసేలా సమాచారా రంగాన్ని బలోపేతం చేశారు.
ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, అమలు చేయదలిచిన పథకాలు, విధానాలు, సాధించిన ఘన విజయాల గురించి ప్రజలకు తెలియజేయడంలో చురుగ్గా పాల్గొనాలని మోదీ ఇటీవల ఆదేశించిన విషయం తెలిసిందే. ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఆరోపనలు, విమర్శలను నిరాధార వార్తలు ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మోదీ బలంగా నమ్ముతున్నారు.
రాజకీయ రంగంలో కొనసాగుతున్నప్పుడు తప్పుడు కథనాలు, అవాస్తవ ప్రచారాలను నియంత్రించడం చాలా కీలకం అనేది తెలిసిందే. అలాంటి కథనాలు ప్రజల అభిప్రాయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంటాయి. వివిధ అంశాలపై వారికి అవగాహనకు బదులు గందరగోళానికి దారి తీస్తాయి. అది చివరకు ఎన్నికలపై ప్రభావం చూపుతుంది.
ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. రాజ్యాంగంలో మార్పులు చేస్తారని.. ప్రజాస్వామ్య పునాదులు దెబ్బతీసేలా బీజేపీ వ్యవహరిస్తోందని పదే పదే ఆరోపించాయి. ఈ సమయంలో రాజ్యాంగంలో మార్పులు చేయాలనే ఉద్దేశం తమకు లేదని.. మోదీ, అమిత్ షా లు పదే పదే చెప్పినా అప్పటికే జరగాల్సి నష్టం జరిగిపోయింది.
జాతీయ భద్రత విషయంలో ప్రత్యేకించి.. లద్దాఖ్ లో చైనా చొరబాట్లకు సంబంధించి భారత ప్రాదేశిక సమగ్రతను కాపాడటంలో బీజేపీ విఫలమైందంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. దీనిని బీజేపీ సమర్థంగా తిప్పికొట్టింది. చైనాకు ఒక్క అంగుళం కూడా భారత భూభాగాన్ని కోల్పోలేదంటూ కుండబద్ధలు కొట్టింది. దేశ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి గణనీయమైన చర్యలు తీసుకున్నామని బలంగా చెప్పింది.
సమయానుకూలంగా, సమర్థంగా కమ్యూనికేషన్ రంగాన్ని వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని మోదీ స్పష్టం చేశారు. తప్పుడు కథనాలను ఎదుర్కోవడానికి మాత్రమే కాకుండా పాలనతో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించడానికి కూడా మాధ్యమాలను వినియోగించడం అత్యవసరం అని సూచించారు. కేంద్ర పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వ అధికారులను భాగస్వామ్యం చేయాలని అన్నారు.