-ముగ్గురు మంత్రులున్నా వరద కష్టాలు తీర్చలేరా.?
- ఖమ్మంను అతలాకుతలం చేసిన వరదలు
- ఎక్కడికక్కడ నిలదీస్తున్న ప్రజలు.
- ఎన్నికల ప్రచారం లాగే నాయకులు వస్తున్నారంటూ విమర్శలు.
గత రెండు రోజుల నుంచి కురిసిన వర్షాలకు తెలంగాణ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. చెరువుల, కుంటలు వాగులు, వంకలు, డ్యాములు అన్ని నిండిపోయాయి. ఎక్కడికక్కడ వాటర్ నిలిచిపోవడంతో ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో తీవ్రంగా పెరిగిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొని ఉన్న సందర్భంలో ఖమ్మం జిల్లాలో మాత్రం మరి దారుణంగా తయారైంది. ఖమ్మం జిల్లాను పూర్తిగా వరదలు ముంచెత్తాయి. ఎక్కడికక్కడ కాలనీలు జల నిర్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో ప్రజలు ఏమి చేయలేక బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. రెండు రోజులుగా ఇండ్లలోకి నీరు చేరడంతో కనీసం తినడానికి కూడా తిండి లేని పరిస్థితి ఏర్పడింది. ఈ తరుణంలో ఖమ్మం జిల్లాలో ముగ్గురు కీలక మంత్రులు ఉన్నా కానీ ఈ కష్టాల నుంచి బయటకి తెచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు. దీంతో మంత్రులందరికి ఎక్కడికక్కడ నిలదీతలు ఎదురవుతున్నాయి. ఆ వివరాలు ఏంటో చూద్దాం.
ఖమ్మంను ముంచిన వరదలు:
గత కొద్దిరోజుల నుంచి ఐఎండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని సూచనలు చేస్తూ వస్తోంది. అయినా మంత్రులు, అధికారులు అక్కడ ఉండేటువంటి ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేయలేకపోయారు. వర్షాలు కురిసి వరదలు వచ్చి నష్టం జరిగేదాకా ఎవరు పట్టించుకోలేదు. చెరువుల నీళ్లు వెళ్లి చెరువు వెనుక పడేదాకా చేసేదేం లేదన్నట్టు మంత్రుల వ్యవహార శైలి చూస్తే అర్థమవుతుంది. మొత్తం ఖమ్మం, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాలో తీవ్రంగా వర్షాలు కురిసాయి. ఇక వీటి కంటే ఖమ్మం జిల్లాలో అన్నిటికంటే ఎక్కువ వర్షం కురియడంతో మరింత దారుణమైన పరిస్థితిలు ఏర్పడ్డాయి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పాలేరులో దారుణమైన వరదలు వచ్చాయి. పాలేరు రిజర్వాయర్ లోకి కనివిని ఎరుగని నీరు వచ్చింది. 80 వేల క్యూసెక్కులు సామర్థ్యం ఉన్న ఆ రిజర్వాయర్ లోకి 1,75,000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుంది. దీంతో ఆ నీటిని కిందికి వదిలే సందర్భంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వరదలు ముంచెత్తాయి.