- ఇద్దరు మంత్రులున్నా భరోసా కరువు
- ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటు న్న ప్రజలు.
గత రెండు రోజులుగా కురిసినటువంటి వర్షాల కారణంగా తెలంగాణ రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో వాగులు, వంకలు చెరువులు, డ్యాములు అన్ని నిండిపోయి నిండుకుండలా మారిపోయాయి. పలు ప్రాంతాల్లో చెరువులు కూడా తెగిపోయి ఊళ్ళకు ఊళ్లే మునిగిపోయాయి. అలాంటి వరద బీభత్సం ఖమ్మం జిల్లాలో ఎక్కువగా ఉంటే, ఆ తర్వాత వరంగల్ జిల్లాలోనే ప్రభావం ఉంది. జిల్లావ్యాప్తంగా ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో ఊర్లకు ఊర్లే మునిగిపోయాయి. చాలా ప్రాంతాల్లో పంట నష్టం కూడా జరిగింది. దీంతో ప్రజలు నిరాశ్రయులయ్యారు. రెండు రోజులుగా కనీసం తినడానికి తిండి లేకుండా ఉన్నాకానీ స్థానికంగా ఉన్నటువంటి ఇద్దరూ మంత్రులు కనీసం పట్టించుకోవడంలేదని విమర్శిస్తున్నారు. మరి వరంగల్ ను ముంచేత్తిన వరదల నుంచి ప్రజలను కాపాడే వారే లేరా. ఆ వివరాలు ఏంటో చూద్దాం..
వరంగల్ ను ముంచెత్తిన వరద.
ఉమ్మడి వరంగల్ జిల్లా ను వర్షం వణికించింది. ఈ వర్షం దాటికి జనజీవనమంతా అతలాకుతలమైంది. మహబూబాబాద్ జిల్లాలోని ఇంటికన్నె, కే సముద్రం మధ్యలో కిలోమీటర్ పైగా రైల్వే ట్రాక్ దెబ్బతిన్నది. ఇదే కాకుండా పలు చెరువులు కూడా గండి పడ్డాయి. ములుగు జిల్లాలోని చాలా ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఏడుస్తున్నారు. జోరు వర్షాల వల్ల ఆకీరు, మున్నేరు, పాలేరు, పాకాల, వట్టివాగులు పొంగిపొర్లుతున్నాయి. అంతేకాకుండా భూపాలపల్లిలో వరదల తాకిడికి పూర్తిగా బొగ్గు ఉత్పత్తిని నిలిపివేశారు. నెక్కొండ మండల కేంద్రంలోని వెంకటాపురం వద్ద తోపనపల్లి వాగు పొంగడంతో బస్సు వరద నీటిలో చిక్కుకుంది. బస్సులో 40 మంది ప్రయాణికులు రాత్రంతా బిక్కుబిక్కుమంటూ బ్రతికేశారు. ఉదయం కలెక్టర్, ఎమ్మెల్యే, ఘటన స్థలానికి చేరుకొని వరదల్లో చిక్కుకున్న 40 మందిని కాపాడారు.