కేసీఆర్ అంటే తెలంగాణకు ఒక బ్రాండ్. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఆయన చేసిన కృషి.. పోరాట పటిమ అంతా ఇంతా కాదు. ఒక విధంగా చెప్పాలంటే కేసీఆర్ ప్రారంభించిన ఉద్యమం వల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిందని చెప్పవచ్చు. ఎన్నో దీక్షలు, పోరాటాలు, సభలు, సమావేశాలు నిర్వహించి తెలంగాణ ఆవశ్యకతను ఊరూరా చాటి చెప్పారు. చివరకు లక్ష్యాన్ని సాధించారు.


నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ప్రజలు సైతం కేసీఆర్ మీద నమ్మకంతో ఆయన్నే సీఎం సీట్లో కూర్చోబెట్టారు. ఒక సారి కాదు రెండుసార్లు అధికారాన్ని కట్టబెట్టారు. దశాబ్దకాలం పాటు రాష్ట్రం ఏ ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ కే ప్రజలు పట్టం కట్టారు. రాష్ట్రం మరే ఇతర పార్టీ కనిపించలేనంతగా పరిస్థితికి తీసుకువచ్చారు. ఒక్కమాటలో చెప్పాలంటే పదేళ్లు ఆ పార్టీ తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగించింది.



ఇంత వరకు బాగానే ఉన్నా ఏ నినాదంతో అయితే రాష్ట్రం ఏర్పడింతో వాటిలో కొన్నింటిని కేసీఆర్ నెరవేర్చలేకపోయారు. సాగునీటితో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేశారు. అయితే ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ఎన్నికల ముందు కుంగడం ఆ పార్టీకి పెద్ద మైనస్. వెనువెంటనే నిరుద్యోగం, అవినీతి ఆరోపణలు ఒక్కొక్కటిగా ప్రజల్లోకి వెళ్లాయి. ఫలితం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.


అయితే ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి కేసీఆర్ జనంలో కనిపించడం మానేశారు. ప్రజాక్షేత్రంలో గతంలో లాగా తిరగడం లేదు. ఎన్నికల తర్వాత తన ఫాం హౌస్ లో కాలు జారి పడటం… విరగడం రెస్ట్ తీసుకోవడం చకచకా జరిగిపోయాయి. ఆ నొప్పి తోనే లోక్ సభ ఎన్నికల్లో ప్రచారం చేసినా.. ఒక్క సీటు రాలేదు. దీంతో కేసీఆర్ కు ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత లేదని అర్థమైంది. అందుకే సైలెంట్ గా ఉంటున్నారు అని విశ్లేషకులు అంటున్నారు. జనంలో వ్యతిరేకత లేకున్నా వచ్చి ప్రజా క్షేత్రంలో పోరాడితే ప్రయోజనం ఉండదని ఆయన భావిస్తున్నారు. అందుకే ప్రభుత్వ వైఫల్యాల మీద కేటీఆర్, హరీశ్ రావు, ఇతర సీనియర్ నాయకుల చేత పోరాటం చేయిస్తున్నారు. ఆ తర్వాత మెల్లమెల్లగా కేసీఆర్ కూడా ప్రజాక్షేత్రంలోకి వస్తారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరి చూద్దాం ఏం జరగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: