తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. వరదలు చుట్టుముట్టేస్తున్నాయి. నదులు, చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ఎక్కడికక్కడ జన జీవనం స్తంభించిపోయింది. విజయవాడ వంటి కొన్ని చోట్ల ప్రజలకు భయటకు రావడమే కష్టం అయిపోయింది. ఇక ఇళ్లలోకి నీరు చేరిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


వాస్తవానికి తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ తో పాటు మహబూబ్ నగర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఖమ్మం అయితే అతలాకుతలం అవుతోంది. మరోవైపు ఉమ్మడి వరంగల్ అటవీ విస్తీర్ణం అధికంగా ఉండే మహబూబాబాద్ కూడా వరదలతో అల్లాడుతోంది. వందలాది గ్రామాలు బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా ఉన్నాయి. అయితే విచిత్రంగా హైదరాబాద్ కు వర్ష ప్రభావం పెద్దగా లేదు. నగరంలో వర్షాలు కురిసినా.. అన్ని ప్రాంతాల్లో సమంగా లేదు. ఉదాహరణకు జూబ్లీహిల్స్ లో ఆదివారం వర్షం ముంచెత్తినా ఖైరతా బాద్ కు వచ్చే సరికి ఆ ప్రభావం లేదు.



ఇక శివారు ప్రాంతాల్లోను వర్ష తీవ్రత తక్కువే. హైదరాబాద్ లో నాలుగేళ్ల క్రితం అక్టోబరులో భారీ వరదలు వచ్చాయి. దీంతో నగరం అతలాకుతలం అయింది. పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. అప్పా చెరువులో కొందరు ఆక్రమణలకు పాల్పడి షెడ్ లు అని చెప్పి ఏకంగా బిల్డింగ్ లు నిర్మించేశారు. దీంతో నీరు ఎటూ వెళ్లలేక జనవావాసాలను ముంచెత్తింది. ఇక్కడే నలుగురు ప్రాణాలు కోల్పోయారు.


ఇక చెరువులు, నాలాల్లో ఇలాంటి ఆక్రమణలు ఎన్నెన్నో.. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రా రంగంలోకి దిగింది. ఫుల్ పవర్స్ తో కమిషనర్ రంగనాథ్ సారథ్యంలో హైడ్రా అక్రమార్కుల పని పడుతోంది. చెరువులు శిఖం భూములు, బఫర్ జోన్ లో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తోంది.


ప్రస్తుతం ఖమ్మం, వరంగల్, నల్లొండలో వర్షం వచ్చి నట్లు హైదరాబాద్ లో వచ్చిఉంటే పరిస్థితి ఏమన్నది చర్చనీయాంశం అవుతుంది. అసలే ఆక్రమణలతో కుచించుకుపోయిన నాలాలు, చెరువులతో రాజధాని అల్లాడేది. ఆస్తి, ప్రాణ నష్టం ఎంత జరిగేదో ఎవరూ  ఊహించలేని పరిస్థితి. దీంతో ఇప్పుడు హైడ్రా చర్యలను అందరూ సమర్థిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: