2009 సంవత్సరం అక్టోబర్ నెలలో తుంగభద్రా నది ఉగ్ర రూపం, కృష్ణానది విలయ తాండవం వల్ల ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఈ ఘటన జరిగి 14 సంవత్సరాలు అవుతున్నా ఆ కన్నీటి జ్ఞాపకాలను కర్నూలు ప్రజలు సులువుగా మరిచిపోలేరు. ఆ కన్నీటి జ్ఞాపకాలను తలచుకుంటే హృదయం ద్రవిస్తుంది. 2009 సెప్టెంబర్ నెల చివరిలో ఏకధాటిగా కురిసిన కుండపోత వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి.
 
తుంగభద్ర తీరంలో ఉన్న మంత్రాలయంతో పాటు నదీ పరివాహక ప్రాంతాలు అన్నీ జలమయం కావడం జరిగింది. లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వల్ల శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్ల పై నుంచి కృష్ణమ్మ పరవళ్లు తొక్కగా సుంకేసుల ప్రాజెక్ట్ కట్టలు తెంచుకోవడం జరిగింది. కృష్ణానది జలాలు వెనక్కు ముంచెత్తడం వల్ల కర్నూలు నగరం అతలాకుతలమైంది. కర్నూలు అనగానే గుర్తుకువచ్చే కొండారెడ్డి బురుజు సగం మునిగిపోయిందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో సులువుగా అర్థమవుతుంది.
 
వేలాది మంది కట్టుబట్టలతో మిగిలే పరిస్థితి ఏర్పడగా ప్రాణ నష్టంతో పాటు తీవ్రస్థాయిలో ఆస్తి నష్టం జరిగింది. వ్యవసాయ భూములు కోతకు గురై రైతులు అప్పుల పాలైన పరిస్థితి ఏర్పడింది. కర్నూలు వరదల సమయంలో దాదాపుగా 50 మంది మృతి చెందారు. కోట్ల రూపాయల నష్టం వాటిల్లగా ఈ ఘటన గురించి కర్నూలు కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. నాటి వరద భీభత్సానికి సంబంధించిన ఫోటోలను తలచుకుంటే ఇప్పటికీ అక్కడి వాసులకు కన్నీళ్లు వస్తాయి.
 
కర్నూలు వరదల సమయంలో దాదాపుగా 65 వేల మంది ప్రత్యేక శిబిరాలలో తల దాచుకోవడం జరిగింది. తీరప్రాంతాలలోని ఇండ్లు రెండు అంతస్తులు పూర్తిగా నీటిలో మునిగిపోగా శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ వల్ల ముంపు సమస్య మరింతగా పెరిగి ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన పరిస్థితి నెలకొంది. రోడ్లపై చనిపోయిన పశువుల కళేబరాల దుర్గంధం, నిలిచిపోయిన విద్యుత్ సరఫరా, నీటి సరఫరా, పూర్తిగా మునిగిన ఇండ్లలోని సామాగ్రి, దుస్తులు పనికిరాకుండా పోవడంతో కర్నూలు వాసులు పడిన ఇబ్బందులు అన్నీఇన్నీ కావు.


మరింత సమాచారం తెలుసుకోండి: