కొన్నికొన్ని గ్రామాల్లో ఎంత దయనీయ పరిస్థితి ఉందంటే.. వరద నీటినీ గిన్నెల్లోకి తీసుకుని.. చీర చెంగు ను అడ్డుపెట్టుకుని వడపోసి తాగుతున్నారంటే.. ఎంత దీన స్థితి ఆవరించిందో అర్థం చేసుకోవచ్చు. ఇలా .. ఒక గంట కాదు.. రోజులే గడుపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇదిలావుంటే.. కొన్ని కొన్ని చోట్ల వరద ప్రభావం తగ్గుముఖం పట్టింది. దీంతో అక్కడి ప్రజలు పరుగు పరుగున ప్రభావం లేని ప్రాంతాలకు కాలినడకనే వెళ్లి.. ఆహారం.. నీటి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రభుత్వం సాయం చేస్తున్నా.. అవి అందని ప్రాంతాలు చాలానే ఉన్నాయి. దీంతో ఇక్కడి ప్రజలు పొరు గు ప్రాంతాలకు వెళ్తున్నారు. అయితే.. ఇదే అలుసుగా.. అవకాశంగా భావిస్తున్న వ్యాపారులు ప్రజలను పీడిస్తున్నారు. 30 రూపాయల విలువైన పాల ప్యాకెట్‌ను 100కు విక్రయిస్తున్నారు. 2 రూపాయల విలువైన వాటర్ ప్యాకెట్‌ను రూ.20 దోచుకుంటున్నారు. ఇక, బిస్కట్ ప్యాకెట్లపై డబుల్ సొమ్ములు దండుకుంటు న్నారు.
పాపం.. నాలుగు రోజులుగా ఆకలితో అలమటిస్తున్న ప్రజలుఇవే మహాప్రసాదంగా తీసుకుని.. కన్నీళ్లు తుడుచుకుంటున్నారు. కానీ, ఇక్కడ మౌలిక ప్రశ్న.. మనం కూడా మనుషులమే కదా! అలా దోచుకోవచ్చా! ? అవకాశాన్ని సొమ్ము చేసుకోవచ్చా? ఎంత వ్యాపారమైనా.. ఇంత దోపిడీ తగునా? అనేదివ్యాపారులు ఆలోచించాలి. కష్టంలో ఉన్న పేదలకు మనం ఎలాగూ సాయం చేయలేం. కానీ, నిత్యం చేసే వ్యాపారాన్ని కూడా దారుణంగా మార్చి.. కష్టాల్లో ఉన్నవారిపై ఇలా గుదిబండలు మోపడం ఎంత వరకు సమంజసం? అనేది ప్రశ్న.