* ఎన్నో విషాదాలు నింపిన విజయవాడ వరదలు..

* నలుగురిని కాపాడి తాను మునిగిపోయిన చంద్రశేఖర్


*మూగ జీవాల కోసం వెళ్లి మృత్యువాత పడ్డ చంద్రశేఖర్..

* చంద్రశేఖర్ భార్య 8 నెలల గర్భవతి





తెలుగు రాష్ట్రాల్లో  వరదలు తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి.... గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న జోరు వాన వల్ల కృష్ణా నది ఉదృతంగా ప్రవహిస్తుంది..గత 50 ఏళ్ళలో ఎన్నడూ లేనంత వర్షపాతం నమోదవడంతో  ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు చిగురుటాకుల్లా వణికిపోయాయి. మరీ ముఖ్యంగా ఏపీలోని విజయవాడ, తెలంగాణలోని ఖమ్మం.. భారీ వర్షాలు, వరదలతో అత్యంత భయంకర పరిస్థితులను చవి చూశాయి.విజయవాడ నగరం మరింత హృదయ విదారకంగా మారింది. విజయవాడ లో ఇంతటి భారీ ముంపుకు కారణం భారీ వర్షాలకు బుడమేరుకు గండ్లు పడటమే.. దీనితో ప్రశాంతంగా వున్న విజయవాడ నగరం ఒక్కసారిగా వరద నీటిలో మునిగిపోయింది..ఇప్పుడిప్పుడే వరద తగ్గుముఖం పడుతుందటంతో సహాయక చర్యలు ఊపందుకున్నాయి.


అదే సమయంలో భారీగా మృతదేహాలు బయటపడుతున్నాయి.ఇప్పటి వరకు భారీగా ఆస్తి నష్టం జరిగినట్లుగా అంచనా వేస్తున్నారు..అలాగే భారీగా ప్రాణనష్టం కూడా జరిగినట్లు తెలుస్తుంది.చిట్టీనగర్ ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల బాలుడు వరద ముంపు లో గల్లంతయ్యాడు..బాలుడి ఆచూకీ కోసం ఆ పిల్లాడి తల్లిదండ్రులు తీవ్రంగా గాలించారు. కానీ ఆ బాలుడు ఈరోజు శవమై తేలాడు. దీంతో వరదల్లోనే ఆ మృతదేహాన్ని తరలిస్తున్న తీరు కలచివేసింది. కుటుంబ సభ్యులు ఒక బల్లపై మృతదేహాన్ని పెట్టి తరలిస్తున్నారు. కనీసం ఆ మృతదేహాలకు అంత్యక్రియలు చేసేందుకు బంధుమిత్రులు కూడా లేని పరిస్థితి ఏర్పడింది..ఇలాంటి దారుణ ప్రమాదాలు చాలానే చోటుచేసుకున్నాయి..
కొడుకు కోసం తాగునీరు తెచ్చేందుకు వెళ్లిన ఓ తండ్రి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు.బుడమేరు వాగు ఎందరి జీవితాలనో పెకలించి వేసింది. ఒక్కసారిగా వచ్చిన వరద ప్రవాహం నగరంలోని ప్రాంతాలను ముంచి వేసింది. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే తీరని నష్టం జరిగింది.చాలా మంది ప్రజలు భవనాల పైకెక్కి ప్రాణాలను కాపాడుకున్నారు.చాలా గంటల పాటు ఆహారం, నీరు లేక ప్రజలు అలమటించారు. ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టడంతో బాధితులకు కాస్త ఉపశమనం కలిగింది.


ఇదిలా ఉంటే విజయవాడ వరదల్లో మరొక విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది.కృష్ణలంకకు చెందిన పలిశెట్టి చంద్రశేఖర్(32)కు సింగ్ నగర్లో ఓ డెయిరీ ఫాం ఉండగా.. ఆయనతో పాటు ఇద్దరు సోదరులు మరియు మరో ఇద్దరు యువకులు డెయిరీ ఫాంలో పని చేస్తున్నారు. ఆదివారం ఒక్కసారిగా వరద పోటెత్తగా.. నీటిలో కొట్టుకుపోతున్న సోదరులతో పాటు ఇద్దరు యువకులను చంద్రశేఖర్ కాపాడి డెయిరీ ఫాం పైకప్పు వద్దకు చేర్చాడు. అనంతరం తాళ్లతో కట్టి ఉంచిన ఆవులను రక్షించేందుకు వెళ్లి.. అవి ప్రాణాలతో ఉంటాయని భావించి తాళ్లు ఊడ తీసాడు... ఆ తర్వాత ఈదుకుంటూ వచ్చి పైకప్పు ఎక్కేందుకు ప్రయత్నించగా కాలు జారి కింద పడి పోవడంతో ప్రవాహంలో కొట్టుకుపోయాడు. డెయిరీ ఫాంకు 500 మీటర్ల దూరంలో చంద్రశేఖర్ మృతదేహం కనిపించింది. ఇదిలా ఉంటే మృతుడు చంద్రశేఖర్ భార్య ఇప్పుడు 8 నెలల గర్భిణీ. తమను కాపాడి కళ్ల ముందే అన్న కొట్టుకుపోయాడంటూ సోదరులు కన్నీరుమున్నీరవుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: