అకాల వర్షాలు, వరదల వల్ల ఏపీలోని విజయవాడ ప్రజలు ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నారా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇలాంటి కష్ట కాలంలో గుంటూరు జిల్లా మంగళగిరిలోని హరేరామ హరేకృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించే అక్షయపాత్ర లక్షల మందికి ఆహారం అందేలా చేసి వాళ్ల కడుపులు నింపింది. అక్షయ పాత్ర వంటశాలలో వరద బాధితుల కోసం ఏకంగా 5 లక్షల ఫుడ్ ప్యాకెట్లు సిద్ధం కావడం గమనార్హం.
 
ఒకవైపు ప్రభుత్వం మరోవైపు దాతలు సహాయ సహకారాలు అందించడం వల్లే ఈ అరుదైన ఘనతను సాధించడం జరిగిందని అక్షయపాత్ర అధికారులు చెబుతున్నారు. వరద బాధితుల కొరకు రుచికరమైన, పౌష్టికాహారాన్ని తయారు చేస్తున్నట్లు అక్షయ పాత్ర అధికారులు చెప్పుకొచ్చారు. మొదటి రోజు 60 వేల మందికి, రెండో రోజు లక్ష మందికి, మూడో రోజు 2 లక్షల మందికి, నాలుగో రోజు ఏకంగా 5 లక్షల మందికి అక్షయ పాత్ర ఆహారం అందించింది.
 
మహిళలు, వివిధ సంస్థలు, అసోసియేషన్ సిబ్బంది, మెప్మా, మహిళా పోలీసుల సహాయంతో ఆహారాన్ని ప్యాకింగ్ చేయడంతో పాటు ఆ ఆహారాన్ని సక్రమంగా బాధితులకు అందించడానికి ఈ సంస్థ కృషి చేసింది. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలలోని పురపాలక సంఘాల నుంచి రోజుకు 400 మంది సిబ్బంది విధుల్లో పాల్గొని కచ్చితంగా లెక్కవేసి మరీ ఆహార ప్యాకెట్లను పంపుతున్నారని తెలుస్తోంది.
 
మంగళగిరికి చెందిన మోటారు మెకానిక్ అసోసియేషన్ సభ్యులు వాహనాలలోకి ఆహారాన్ని ఎక్కించడానికి స్వచ్చందంగా ముందుకు వచ్చినట్టు సమాచారం అందుతోంది. వరద బాధితులకు మరే సంస్థ కూడా ఇంత భారీ స్థాయిలో ఆహారం అందించడం సులువు కాదు. అక్షయ పాత్ర ఫౌండేషన్ సేవలను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అక్షయ పాత్ర లాభాపేక్ష లేని ట్రస్ట్ కాగా దేశంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం సైతం ఈ సంస్థ ద్వారా అమలవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: