కేంద్రంలోని కూటమి ప్రభుత్వం తమకు సాయం చేయాలని.. మెజారిటీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రం లోనూ..కేంద్రంలోనూ ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఉందని.. కేంద్రం తలుచుకుంటే.. సాయం చేయడం కష్టం కాదని కూడా చెబుతున్నారు. కానీ.. ఈ విషయంలో చంద్రబాబు మౌనంగా ఉంటున్నారు. ఇక్కడ ఏం జరుగుతున్నా.. కేంద్రం నుంచి నిలదీసి సాయం చేయించుకోవడంలో ఆయన నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారు.
మాకు 10 వేల కోట్లు తక్షణం అవసరం ఇవ్వాల్సిందే.. అని చంద్రబాబు పట్టుబట్టలేక పోతున్నారు. కేంద్రాన్ని ఇప్పుడు నిలదీయక పోతే.. ఇంకెప్పుడు నిలదీస్తారన్నది సాధారణ ప్రజల మాట. పొరుగున ఉన్న తెలంగాణలో ఖమ్మం సహా .. కొన్ని జిల్లాలు నీట మునిగాయి. దీంతో అక్కడి ప్రభుత్వం కేంద్రానికి వెంటనే లేఖ సంధించింది. తమకు తక్షణ అవసరంగా 57 వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని.. సీఎం రేవంత్ రెడ్డి మోడీకి లేఖ రాశారు.
మరి కేంద్రంలో మోడీ సర్కారు నిలబడేందుకు.. కారణమైన చంద్రబాబు ఎందుకు ఇప్పుడు కూడా మౌనంగా ఉంటున్నారు. నాలుగు బోట్లు పంపించండి.. రెండు హెలికాప్టర్లు పంపించండి అని మాత్రమే ఆయన అడుగుతున్నారు తప్ప.. `రండి... వచ్చి స్వయంగా పరిశీలించండి.. మాకు సాయం చేయండి..` అని ఎందుకు అడగలేకపోతున్నారు. పోనీ.. ఆయన అడకపోయినా.. బీజేపీ నేతలైనా.. కేంద్రానికి సమాచారం ఇవ్వాలి కదా! ఇవేవీ చేయకపోతుండడం పట్ల ప్రజలు తీవ్ర ఆవేదనలోనూ.. ఆగ్రహంతోనూ ఉన్నారు. మరి ఇప్పటికైనా చంద్రబాబు తన నిదానాన్ని పక్కన పెట్టి కేంద్రాన్ని నిలదీయాల్సిన అవసరం ఉందనేది సామాన్యుల మాట.