-బాలాపూర్ లడ్డే రాష్ట్రవ్యాప్తంగా ఫేమస్..
- లక్షలు పెట్టి వేలం పాట..
గణపతి నవరాత్రి ఉత్సవాలు వచ్చాయంటే చాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో గణేష్ మండపాలు కళకళలాడి పోతాయి. నవరాత్రులు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. గల్లి నుంచి ఢిల్లీ వరకు ఈ పూజలు తప్పనిసరిగా జరుగుతాయి. గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో గణపతి పూజలను చాలా స్పెషల్గా నిర్వహిస్తూ ఉంటారు. అలా గణపతి ఉత్సవాల్లో ప్రతి ఏడాది స్పెషల్ గా ఉన్నటువంటి గణపతి ఎవరయ్యా అంటే ఖైరతాబాద్ లో ప్రతిష్టించే గణపతి. ఈ వినాయకున్ని దర్శించుకోవడానికి కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. తొమ్మిది రోజులపాటు ఎంతో కోలాహలంగా ఈ పూజలు జరుగుతాయి. ఆ తర్వాత అత్యంత ప్రాముఖ్యత సాధించిన గణేశుడు బాలాపూర్ గణపతి. ఇక్కడ గణేశుడికి పెట్టిన లడ్డు చాలా ఫేమస్. ఈ లడ్డు కోసం వేలాదిమంది వేలంలో పాల్గొని పాట పాడుతారు. ఎందుకంటే ఈ లడ్డు తీసుకున్న వారికి ఏది అనుకుంటే అది జరుగుతుందట. అలాంటి బాలాపూర్ లడ్డు ప్రత్యేకత ఏంటి ఆ వివరాలు ఏంటో చూద్దాం..
బాలాపూర్ లడ్డు ప్రత్యేకత:
హైదరాబాద్ వ్యాప్తంగా గణేష్ ఉత్సవాల సందడి నెలకొంది. ఉత్సవాల సందర్భంగా బాలాపూర్ లడ్డు పైనే అందరి దృష్టి ఉంటుంది. ఇలాంటి ఈ లడ్డును ఎవరైతే సొంతం చేసుకుంటారో వారికి అష్టైశ్వర్యాలతో పాటు అనుకున్నది సాధిస్తారట. 1994 నుంచి ఈ లడ్డు ప్రాచుర్యంలోకి వచ్చింది.అప్పటినుంచి లడ్డు ధర ప్రతి ఏటా పెరగడమే తప్ప తగ్గడం లేదు.అలాంటి ఈ లడ్డును ఎవరు తయారు చేస్తారు..ఎలా తయారు చేస్తారు అనేది చూద్దాం. 1980లో మొదలైన బాలాపూర్ గణేశుడి ప్రస్థానం 44 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది.కానీ వేలంపాట మాత్రం 1994లో మొదలైంది. అప్పటినుంచి ఇప్పటివరకు ఈ లడ్డును ప్రతి ఏట వేలంపాట వేస్తూ వస్తున్నారు. మొదటిసారి 450 రూపాయలతో లడ్డువేలం ప్రారంభమై క్రమంగా వందలు వేలు లక్షలు దాటింది. లడ్డు తీసుకున్న వారికి గణేశుడి అనుగ్రహం ఉండడంతో పాటు తీసుకున్నవారు కోటీశ్వరులు అయిపోయి సిరిసంపదలతో కుటుంబాలతో హ్యాపీగా ఉంటున్నారట. దీంతో ఈ లడ్డుకు మరింత ప్రత్యేకత సంతరించుకుంటూ వస్తోంది. అప్పట్లో బాలాపూర్ లడ్డూ వేలంలో ఎక్కువగా బాలాపూర్ వాసులే పాల్గొనేవారు. కానీ కాలక్రమేనా అది కాస్త పెరుగుతూ వచ్చింది. అంతేకాకుండా ఈ లడ్డును తాపేశ్వరం హనీ ఫుడ్స్ అనే సంస్థ వారు తయారు చేస్తారు. 2010 నుంచి 21 కిలోల బాలాపూర్ లడ్డును దుకాణదారుడు ఉమామహేశ్వరరావు నైవేద్యంగా సమర్పించాడు.