దీంతో కేంద్రం నుంచి ఒకవైపు.. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పరిశీలన కోసం.. నష్టం అంచనాల కోసం.. ఒక బృందం వచ్చింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో బృందం సభ్యులు పర్యటించారు. నష్టాలను అంచనా వేస్తున్నారు. సీఎం చంద్రబాబుతోనూ వారు భేటీ అయ్యారు. అయితే.. మరోవైపు కేంద్రం నుంచి మంత్రులు కూడా వచ్చారు. మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్.. విజయవాడకు చేరుకుని మంత్రి నారా లోకేష్‌తో భేటీ అయ్యారు. అనంతరం.. ఆయన రాజరాజేశ్వరి పేటలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులతో నేరుగా మాట్లాడి వారి కష్టాలు తెలుసుకున్నారు.
ఇక, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు.. కేంద్రం నుంచి అందే సాయంపై లెక్కలు వేస్తున్నా రు. ఇక్కడి పరిస్థితులను సమన్వయం చేస్తూ.. కేంద్రానికి ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తున్నారు. మరో కేంద్ర మంత్రి.. పెమ్మసాని చంద్రశేఖర్ కూడా బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ప్రజలకు భరోసా ఇస్తున్నారు. బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి, నరసాపురం ఎంపీ శ్రీనివాసవర్మ కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. బీజేపీ పక్షాన అందించాల్సిన సాయంపై ఆయన లెక్కలు వేస్తున్నారు. ఇలా.. మొత్తంగా కేంద్ర మంత్రులు కదిలారు.
మరి సాయం చేసేందుకు కొంత సమయం పట్టినా.. ఖచ్చితంగా కేంద్రం ఆదుకుంటుందనే ధీమా అయితే .. చంద్రబాబుకు వచ్చింది. ఈ పరిణామాలతో పొత్తుకు న్యాయం జరిగిందంటూ.. కూటమి పార్టీలు భావిస్తున్నాయి. నిజానికి.. ఇప్పుడున్న పరిస్థితిలో కూటమి పార్టీల సహకారం చంద్రబాబుకు చాలా అవసరం. భారీ ఎత్తున రోజుల తరబడి సంభవించిన ఈ విపత్తులో పొత్తు పార్టీలు న్యాయం చేస్తారని ఆయన పెట్టుకున్న ఆశలు.. కేంద్రం సఫలం చేసేందుకు ముందుకు రావడం పట్ల ప్రభుత్వ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.