ఈ వరదల్లో వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలను కోల్పోగా లక్షల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులు అయ్యారు. అప్పట్లోనే ఈ వరదలు కోట్ల రూపాయల నష్టాలను మిగల్చడం గమనార్హం. 1996 సంవత్సరం నవంబర్ నెల 6వ తేదీన కోనసీమలో వచ్చిన వరద వల్ల గోదావరి జిల్లాల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ తుఫానును ఆంధ్రా తుఫాను అని కూడా పిలుస్తారు.
ప్రపంచ దేశాలే కదిలొచ్చి వరద బాధితులకు ఆపన్న హస్తం అందించాయంటే ఈ తుఫాను మిగిల్చిన విషాదం ఏపాటిదో సులువుగానే అర్థం చేసుకోవచ్చు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయు గుండం పెను తుఫానుగా మారి కాకినాడకు దక్షిణంగా 53 కిలోమీటర్ల దూరంలో కోనసీమ దగ్గర తీరాన్ని తాకింది. 215 కిమీల ప్రచండ వేగంతో పెను గాలులు వీచాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
12 అడుగుల ఎత్తున అలలు ఎగిసిపడగా 250 గ్రామాలపై తుఫాను తీవ్ర ప్రభావం చూపడం గమనార్హం. మరో 1,380 గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవగా ఆ సమయంలో మత్స్యకార గ్రామాలన్నీ పూర్తిగా తుడిచిపెట్టుకునిపోయాయి. ఆ సమయంలో ఒక అమెరికా సంస్థ అంచనా ప్రకారం ఏకంగా 4490 కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. కోనసీమ తుఫాను భీభత్సం గురించి ఇప్పటికీ అక్కడి ప్రజల కళ్లు కన్నీళ్లతో చెమర్చుతాయి. ఈ ఘటన తర్వాత ప్రభుత్వం ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా ఎన్నో చర్యలు చేపట్టింది.