హైదరాబాద్ మహానగరంలో కోటి కంటే ఎక్కువమంది జీవనం సాగిస్తున్నారనే సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో జీవనం సాగించాలంటే ఆర్థికంగా స్థిరపడితే మాత్రమే సాధ్యం అవుతుందని చెప్పవచ్చు. బహుళ అంతస్తుల్లో వాహనాల పార్కింగ్ కోసం చేపట్టే సెల్లార్ల నిర్మాణాలకు స్వస్తి చెప్పాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. వీటిపై ఫిర్యాదులు వస్తుండగా వర్షపు నీరు చేరడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
 
భారీ వర్షాలు కురిసిన సమయంలో సెల్లార్లలో నీటిని ప్రత్యేక మోటార్ల సహాయంతో తోడాల్సి వస్తోంది. లోతు తవ్వకాల వల్ల వచ్చే మట్టితో కూడా సమస్యలు ఎదురవుతున్నాయి. ఇళ్ల నిర్మాణ వ్యయం పెరగడానికి సెల్లార్లు సైతం కారణమవుతున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయ్. బహుళ అంతస్తుల నిర్మాణాల్లో ఐదారు సెల్లార్ల వరకు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
 
ప్రభుత్వం సైతం హైదరాబాద్ లో గతంలోనే భూకంప ప్రభావిత ప్రాంతాలను గుర్తించడం జరిగింది. అక్కడ సెల్లార్ల నిర్మాణాలు ప్రమాదకరం అని నిపుణులు సైతం చెబుతున్నారు. సెల్లార్లను అనుమతించకపోతే వీటన్నింటికీ పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తుండటం గమనార్హం. ఈ అంశంలో చట్టబద్ధతను తీసుకొచ్చి పురపాలక చట్టంలోని భవన నిర్మాణ అనుమతుల నిబంధనలను సవరించనున్నట్టు అధికారి చెప్పారు.
 
భవనాలలో పార్కింగ్ కోసం సెల్లార్ కు బదులుగా స్టిల్ట్ లను చేపట్టాలని అధికారులు డిజైన్ లో సవరణలను సూచిస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్ని అంతస్తులు అయినా స్టిల్ట్ నిర్మాణాలకు అనుమతులు ఇస్తామని అధికారులు చెబుతున్నారు. రెండు నుంచి మూడు స్టిల్టుల వరకు అనుమతులు ఇస్తారని తెలుస్తోంది. అయితే చట్టంలో కొన్ని సవరణలు చేయాల్సి ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ సెల్లార్ల విషయంలో ప్రజాభిప్రాయం ఏ విధంగా ఉండనుందో చూడాల్సి ఉంది.  ప్రభుత్వం చేపట్టిన సవరణలు త్వరలో పూర్తిస్థాయిలో అమలులోకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.  వాణిజ్య నిర్మాణాల్లో గ్రౌండ్ ఫ్లోర్ కు ఊహించని డిమాండ్ ఉన్న నేపథ్యంలో అక్కడ పార్కింగ్ సదుపాయం కల్పిస్తే నష్టపోతామనే చర్చ సైతం జరుగుతోంది.








మరింత సమాచారం తెలుసుకోండి: