తెలంగాణలో త్వరలోనే 10 శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలు వస్తాయని.. తమ పార్టీ కచ్చితంగా విజయం సాధిస్తుందని.. బిఆర్ఎస్ నేతలు ఒకటే ప్రచారం చేసుకుంటున్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో టిఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని.. దీంతో ఉప ఎన్నికలు వస్తాయని బిఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల అనార్హత పిటిషన్‌పై హైకోర్టు సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పు తర్వాత తెలంగాణలో ఉప ఎన్నిక‌ల ప్రచారం జోరుగా సాగుతోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ మాత్రం హైకోర్టు తీర్పుపై ఆచితూచి వ్యవహరిస్తోంది.


న్యాయస్థానం తీర్పును తాను గౌరవిస్తున్నాం అని చెబుతూనే.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ చివరగా నిర్ణయం తీసుకుంటారని చెబుతోంది. ఎమ్మెల్యేల అనర్హత వేటుపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు అసెంబ్లీ కార్యదర్శి ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు హైకోర్టు తీర్పు ఇవ్వడంతో తర్వాత స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతుంది ? అన్నది ఆసక్తిగా మారింది. స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా.. లేక డివిజన్ బెంచ్‌ను ఆశ్రయిస్తారా.. అన్నది కూడా చూడాలి. హైకోర్టు తీర్పు తర్వాత ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని తెలంగాణ రాజకీయ వర్గాలలోను చర్చ‌కి వస్తోంది.


వాస్తవానికి పిఎసి చైర్మన్ పదవిని ప్రతిపక్ష పార్టీ ప్రతిపాదించిన నాయకుడికి ఇవ్వటం సాంప్రదాయంగా వస్తోంది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని పిఎసి చైర్మన్‌గా నియమిస్తూ స్పీకర్ కార్యాలయం నిర్ణయం తీసుకుంది. అయితే ఇటీవల గాంధీ.. రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. గాంధీని ఇప్పటికి స్పీకర్ బి.ఆర్.ఎస్ ఎమ్మెల్యే గానే గుర్తిస్తున్నారా ? అని అనుమానం కలుగుతుంది. మరోవైపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటే... బిఆర్ఎస్ పిటిషన్ పై స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి ముందు.. పార్టీ మారిన ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకోవాల్సి ఉంది. లేదంటే అనర్హత వేటు వేస్తారా ? అన్నది కూడా చూడాలి. వేటు వేస్తే మాత్రం తెలంగాణలో కచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి. ఉప ఎన్నికలు వస్తే తెలంగాణలో మళ్లీ రాజకీయ కోలాహలం తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: