ఈ మధ్య కాలంలో తెలంగాణలో ఎక్కడ చూసినా హైడ్రా పేరు ఎక్కువగా వినిపిస్తోంది. హైడ్రా ఎప్పుడు ఏ భవనాన్ని కూల్చేస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఏళ్ల తరబడి నివశిస్తున్నా, ట్యాక్సులు చెల్లిస్తున్నా హైడ్రా ఎప్పుడు ఎవరికి ఎలా షాక్ ఇవ్వనుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలో అనేక భవనాలను ఇప్పటికే హైడ్రా కూల్చేసిన సంగతి తెలిసిందే.
 
ఎక్కడ భూమిని కొంటే ఏ సమస్య వస్తుందో అనే టెన్షన్ ప్రస్తుతం ప్రజల్లో ఉంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా భూముల కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లు తగ్గడం స్థిరాస్తి బిజినెస్ పై తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతోంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ప్రస్తుతం వెలవెలబోతున్నాయి. గతంలో ఉమ్మడి జిల్లాలో తక్కువ ధరకు భూములు లభిస్తున్నాయంటే కొనుగోలు చేసిన వాళ్లు ప్రస్తుతం భూముల కొనుగోలుకు సంబంధించి ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకుంటున్నారు.
 
ఉమ్మడి జిల్లా హైదరాబాద్ కు సమీపంలో ఉండటంతో అక్కడి పరిణామాలు తీవ్రంగా ప్రభావం చూపిస్తున్నాయని తెలుస్తోంది. అన్ని అనుమతులు ఉండటంతో పాటు నీటి వనరులకు దూరంగా ఉన్న భూములను జనం ఎక్కువగా కొనుగోలు చేస్తుండటం గమనార్హం. స్థిరాస్థి వ్యాపారులు సైతం ఎఫ్.టీ.ఎల్ జోన్లలో, బఫర్ జోన్లలో వెంచర్లను ఏర్పాటు చేసే సాహసం చేయరనే సంగతి తెలిసిందే.
 
హైదరాబాద్ కు సమీపంలో ఉన్న మండలాల్లో ఉన్న భూములను రాజధానికి చెందిన వ్యాపారులు ఎక్కువగా కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పుడు వారు సైతం ఆసక్తి చూపడం లేదని సమాచారం అందుతోంది. ఆగస్టులో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో 7315 దస్తావేజులు నమోదయ్యాయి. ప్రభుత్వానికి 19.31 కోట్ల రూపాయల అదాయం వచ్చింది. గతేడాది ఆగష్టులో 9007 దస్తావేజులు రాగా ప్రభుత్వానికి 22.20 కోట్ల రూపాయల ఆదాయం రావడం గమనార్హం. హైడ్రా గుబులు ఎఫెక్ట్ రాబోయే రోజుల్లో ఎంతలా ఉంటుందో తెలియాలంటే మరి కొంతకాలం ఆగాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: