గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం కొసమెరుపు. పూర్తి వివరాల్లోకి వెళ్లితే.. గుంటూరులోని జీజీహెచ్‌లో భట్టిప్రోలుకు చెందిన మీరాబి అనే మహిళ కొద్ది రోజుల క్రితం శిశువుకు జన్మనివ్వగా ఆ పసికందు పురిట్లోనే మృతి చెందింది. దాంతో తల్లి మీరాబి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతోంది. ఈ క్రమంలో సోమవారం మీరాబి వద్ద మరో ఆడ శిశువు ఉండటాన్ని ఆస్పత్రి సిబ్బంది గమనించి ఆరా తీశారు? ఈ క్రమంలోనే ఎక్కడైనా శిశువును దొంగిలించారా? లేదంటే ఎవరివద్దైనా కొనుగోలు చేశారా? అని అనుమానం కలిగింది వారికి. దీంతో అప్రమత్తమైన జీజీహెచ్ గైనకాలజిస్ట్ ప్రొఫెసర్ జయంతి ఉన్నతాధికారుల ద్వారా ఐసీడీఎస్ అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు.
అయితే సమాచారం అందుకున్న ఐసీడీఎస్ అధికారులు కొత్తపేట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి బాపట్ల జిల్లా చినగంజాంకు చెందిన లక్ష్మీ అనే మహిళ చీరాలలో ఆడశిశువుకు జన్మనిచ్చి, అనారోగ్యం దృష్ట్యా 2 వారాల క్రితం ఆమె వైద్యం నిమిత్తం మీరాబి పురుడు పోసుకున్న అదే గుంటూరు ప్రభుత్వా ఆసుపత్రికి వచ్చింది. అక్కడ చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించి ఆమె మృతి చెందింది. దీంతో తల్లిలేకపోవడంతో పసికందు పాలకోసం అల్లాడిపోయింది. ఈ విషయం తెలుసుకున్న మీరాబి స్నేహితురాలు వెంటనే చిన్నగంజాంకు వెళ్లి లక్ష్మి భర్త సుబ్రమణ్యంను కలిసింది. తన స్నేహితురాలి పరిస్థితి గురించి లక్ష్మి భర్త సుభ్రమణ్యంకు చెప్పి.. ఆడ శిశువును విక్రయించేందుకు అతన్ని ఒప్పించింది. అనంతరం అతనికి రూ.1.90 లక్షలు చెల్లించి అతని వద్ద ఉన్న ఆడ శిశువును కొనుగోలు చేసి, మీరాబికి అప్పగించినట్లు పోలీసుల విచారణలో తేలింది. విషయం ఏదైనప్పటికీ అనధికారికంగా బిడ్డను కొనుగోలు చేయడం నేరంగా పరిగణించిన పోలీసులు మీరాబి నుంచి శిశువును స్వాధీనం చేసుకుని ఐసీడీఎస్ ఆధ్వర్యంలోని శిశు సంక్షేమ వసతి గృహ కేంద్రానికి తరలించారు.