ఆంధ్రాలో ఎన్నికల ముందు వరకూ వైసీపీ, ప్రత్యర్థి టీడీపీ కంటే కూడా ఎక్కువగా జనసేనను గట్టిగా టార్గెట్ చేస్తూ వచ్చింది. అది జగన్ నుంచి మొదలై వైసీపీ ఫైర్ బ్రాండ్లు కూడా పవన్ మీద అనుచితమైన వ్యాఖ్యలు చేసేవారు. ఎంతలా అంటే పవన్ వ్యక్తిగత జీవితంలోకి చొరబడి మరీ ఘాటైన కామెంట్స్ చేసేవారు. కట్ చేస్తే పవన్ వెనక ఉన్న బలమైన సామాజిక వర్గానికి వైసీపీ అనుకోకుండానే శత్రువుగా మారిపోయింది. బేసిగ్గా పవన్ ఫక్తు పొలిటీషియన్ కాదు, ఆయనకు రాజకీయ వైరాలు ఎవరితో కూడా లేవు. అలాంటి పవన్ కి కోరి కెలికి కెలికి ఆగర్భ శత్రువుగా మార్చుకుంది వైసీపీ కేడర్. దాంతో పవన్లో ఎంతలా పట్టుదల పెరిగింది అంటే ఎన్ని తక్కువ సీట్లు అయినా పర్వాలేదు గానీ, పొత్తుకు సిద్ధపడేటట్లుగా సన్నద్ధమయ్యారు.

ఈ క్రమంలో వైసీపీని ఓడించాలి అన్న ఏకైక అజెండాతోనే 2024 ఎన్నికల్లో పవన్ బరిలోకి దిగి వైసీపీ గొంతుకలు అన్నీ మూగబోయేలా చేసాడు పవన్. కూటమి దెబ్బకి ఫ్యాన్ పార్టీ కుదేలు అయింది. ఇక ఎట్టకేలకు ఎన్నికలు ముగిసాయి. కూటమి అధికారంలోకి వచ్చింది. కానీ అంతా అనుకున్నట్లుగా గడిచిన మూడు నెలలలో జనసేన జగన్ మీద ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదు. ఆయన తనకు ఉన్న అపరిమితమైన అధికార బలం చూసుకుని వైసీపీని టాప్ టూ బాటమ్ ఏకేయొచ్చు. కానీ పవన్ ఎంతో హుందాగా సంయమనం పాటిస్తూ రాజకీయాలు చేస్తూ వస్తున్నారు. ఆయనకు ఈ రాజకీయ కక్షలు ప్రతీకార రాజకీయాలు అన్నవి గిట్టవు అన్న మాటలనే నిజం చేస్తూ ఒక స్పూర్తిగా ఉంటున్నారు.

ఇక అదే సమయంలో వైసీపీ కూడా గత 3 నెలలుగా ఆయనను ఒక్క మాట అంటే ఒక్కమాట కూడా అనడంలేదు. ఎందుకంటే పవన్ ని ఒక్క మాట అన్నా ఆయన వెనక ఉన్న బలమైన సామాజిక వర్గం ఎంతలా దెబ్బేస్తుందో వైసీపీకి బాగా తెలిసొచ్చింది. దాంతో జనసేనను పక్కన పెట్టి వైసీపీ తన రాజకీయాన్ని టీడీపీతో మాత్రమే చేస్తున్నట్టు కనబడుతోంది. టీడీపీ కూటమిలో 3 ప్రధాన పార్టీలు ఉన్నా చంద్రబాబునే వైసీపీ టార్గెట్ చేస్తుండడం కొసమెరుపు. ఇలా మొత్తానికి ఏపీలో మాత్రం జనసేన వర్సెస్ వైసీపీ అన్నదే లేకుండా పోయింది అని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మరి భవిష్యత్తులో ఎలా గేమ్ ఎలా ఉండబోతుందో చూడాలి మరి!

మరింత సమాచారం తెలుసుకోండి: