త్వరలో తెలంగాణ క్యాబినెట్ విస్తరణ ఉంటుందన్న ప్రచారం మొదలైంది. ఖాళీగా ఉన్న ఆరు మంత్రి పదవులు ఒకేసారి భర్తీ చేస్తారని ప్రచారం కూడా జరుగుతుంది. విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న రాహుల్ ఈ వారంలో ఢిల్లీకి చేరుకుంటారు. ఆ వెంటనే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఢిల్లీకి వెళ్లి కేబినెట్ విస్తరణ పై  రాహుల్ గాంధీతో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కొంతకాలంగా పెండింగ్లో ఉన్న పీసీసీ అధ్యక్షుడు ఎంపిక ఇటీవల క్లియర్ అయింది. దీంతో అధిష్టానం క్యాబినెట్ విస్తరణ పై పోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రేవంత్ రెడ్డితో కలుపుకుని క్యాబినెట్లో 12 మంది మంత్రులు ఉన్నారు.


మరో ఆరుగురిని మంత్రులుగా తీసుకోవచ్చు. అయితే ఖాళీగా ఉన్న ఆరు స్థానాలను ఒకేసారి భర్తీ చేయాలనే అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. కొన్ని మంత్రి పదవులు ఖాళీగా ఉంచడం వల్ల ఆ పదవుల కోసం పైర‌వీలు జరిగితే అనవసర వివాదాలు తలెత్తుతాయి. అన్న అభిప్రాయం ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పది నెలలు పూర్తవుతుంది. అయినా పూర్తిస్థాయి క్యాబినెట్‌ను ఏర్పాటు చేయలేదు అన్న విమర్శలు ఉన్నాయి.


పూర్తిస్థాయి క్యాబినెట్ ఏర్పాటు చేస్తే పరిపాలనపై పూర్తిగా దృష్టి పెట్టవచ్చని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలకు కూడా మంత్రివర్గంలో తీసుకుంటారా అనే సందేహాలకు రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చేశారు. పార్టీ మారిన వారికి ఛాన్స్ లేదని కుండ బద్దలు కొట్టేశారు. దీంతో ఆరు మంత్రి పదవుల కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య తీవ్రస్థాయిలో పోటీ ఉంది.


ఉమ్మడి రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. క్యాబినెట్ విస్తరణలో రెడ్డి సామాజిక వర్గానికి రెండు పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఒక్క పదవి దక్కుతుందని ప్రచారం జరుగుతుంది. రేవంత్ రెడ్డి మాత్రం క్యాబినెట్ విస్తరణలో ఎలాంటి అసంతృప్తులకు తావు లేకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: