ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు నేడు లేఖ రాశారు. మంగళగిరిలోని తన నివాసాన్ని ఇకపై క్యాంపు కార్యాలయంగానూ ఉపయోగించుకుంటానని వెల్లడించారు. అందుకే, విజయవాడలో కేటాయించిన క్యాంపు కార్యాలయాన్ని, ఫర్నిచర్, ఇతర సామగ్రి సహా వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానని పవన్ తన లేఖలో పేర్కొన్నారు. విజయవాడలో ఎంతో విశాలమైన క్యాంపు కార్యాలయాన్ని తనకు కేటాయించడం పట్ల చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే, ఇకపై మంగళగిరిలోని నివాసం నుంచే కార్యకలాపాలు కొనసాగించాలని నిర్ణయించుకున్నందున, విజయవాడ క్యాంపు కార్యాలయాన్ని ప్రభుత్వానికి తిరిగి అప్పగిస్తున్నానని జనసేనాని వివరణ ఇచ్చారు.

ఇదిలావుండగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టగానే.. ఆయనకు విజయవాడలోని జలవనరులశాఖకు చెందిన గవర్నర్ పేటలోని భవనాన్ని క్యాంపు కార్యాలయంగా కేటాయించారు. అక్కడ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు కూడా స్వీకరించారు.. ఆ తర్వాత అక్కడికి పెద్దగా వెళ్లలేదని చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి ఆ భవనాన్ని ప్రభుత్వానికి అప్పగించడం ఆసక్తికరంగా మారింది. ఈ భవనానికి వాస్తుపరమైన ఇబ్బందులు ఉన్నాయా అనే చర్చ జరుగుతోంది. ఆ భవనంలో 2014-2019 మధ్య టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న దేవినేని ఉమామహేశ్వరరావు.. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు. అయితే ఆ తర్వాత వీరు రాజకీయంగా ఇబ్బందిపడ్డారు. అందుకే ఈ భవనం కలిసిరాదనే సెంటిమెంట్ ఉందనే చర్చ నడుస్తోంది.

ఇదే నేపథ్యంలో మరో వాదన కూడా వినిపిస్తోంది.. పవన్ కళ్యాణ్‌కు కేటాయించిన భవనానికి సంబంధించి ప్రభుత్వం రూ.82 లక్షలు నిధులు విడుదల చేసిందట. ఈ వ్యవవహారంపై పవన్ కళ్యాణ్‌ టార్గెట్‌గా వైఎస్సార్‌సీపీ విమర్శలు చేసింది. ప్రభుత్వం దగ్గర అసలు నిధులు లేవని చెప్పిన పవన్ కళ్యాణ్ ఆఫీస్‌కు అన్ని లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయని కొందరు ఆ జీవోతో సోషల్ మీడియాలో ప్రశ్నించారు. ప్రభుత్వానికి ఆ రూ.82 లక్షలు కూడా మిగల్చాలనే ఉద్దేశంతో పవన్ ఈ నిర్ణయం ఈ నిర్ణయం తీసుకున్నారనే చర్చ జరుగుతోంది. కారణం ఏదైనా పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: