రాష్ట్ర విభజన జరిగి పది ఏళ్లు అవుతోంది. కానీ ఇంత వరకు విభజన హామీలు అమలుకు నోచుకోలేదు. ప్రధానంగా ప్రత్యేక హోదాను మరుగున పడేశారు. ప్రత్యేక హోదాపై అనేక పోరాటాలు చేసిన జగన్ సైతం తాను అధికారంలోకి రాగానే దానిపై నోరు మెదపలేదు. తాజాగా అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం కూడా ప్రత్యేక హోదా గురించి ఎక్కడా మాట్లాడలేని పరిస్థితి.
ఇటువంటి తరుణంలో ప్రత్యేక హోదాపై ఏపీ హైకోర్టు కేంద్రానికి నోటీసులు ఇవ్వడం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకొంది. ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రత్యేక హోదా గురించి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే కేంద్రం నుంచి ఆర్థిక సహకారం, సహాయం అవసరం అని కేఏ పాల్ కోర్టుకి వివరించారు. ఏపీకి విభజన తర్వాత ప్రత్యేక హోదాతో పాటు కేంద్రంమద్దతు చాలా అవసరం అని ఆయన అన్నారు. ఏపీ ప్రస్తుత, గత ప్రభుత్వాలు సైతం ప్రత్యేక హోదా కోరుతున్న వైనాన్ని ప్రస్తావించారు.
కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్లులు జస్టిస్ నరేందర్, జస్టిస్ కిరణ్ మై తో కూడిన ధర్మాసనం కేంద్రానికి నోటీసులు జారీ చేయడం విశేషం. ప్రత్యేక హోదాకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలని కేంద్ర ఆర్థిక శాఖ, హోం శాఖ, నీతి ఆయోగ్ ఛైర్మన్లలతో పాటు ఏపీ ప్రభుత్వ కార్యదర్శకి నోటీసులు ఇచ్చింది.
అనంతరం ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది. ప్రత్యేక హొదాని అంతా మరిచిపోతున్న తరుణంలో ఈ తేనె తుట్టెని కేఏ పాల్ కదిల్చారు. గత కొద్ది రోజులుగా కేపీ పాల్ ప్రత్యేక హోదాపై గట్టిగానే పోరాడుతున్నారు. ఏదో విధంగా కేంద్రం చెవిలో జోరీగలా ఈ హోదా మాట వినిపించేలా చేశారు. ఇప్పుడు ఏకంగా హైకోర్టు నుంచి నోటీసులు వచ్చేలా చేశారాయన. ఓ రకంగా ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్ద సమస్య అనే చెప్పాలి.