వైసీపీ అధికారం కోల్పోయిన త‌ర్వాత‌.. చాలా రోజుల‌కు మార్పు దిశ‌గా అడుగులు వేయ‌డం ప్రారంభించింది. భారీ ఓట‌మి ప్ర‌భావంతో దాదాపు మూడు మాసాల పాటు పార్టీ కార్య‌క‌లాపాలు స్తంభించి పోయాయ‌నే చెప్పాలి. కీల‌క నాయ‌కులు ఎవ‌రూ కూడా ముందుకు రాలేదు. దీనికితోడు కొందరు నాయ‌కులు పార్టీ నుంచి బ‌య‌ట‌కు పోయారు. మ‌రి కొంద‌రు రాజీనామాల బాట ప‌ట్టారు. ఈ మొత్తం ప్ర‌భావంతో పార్టీపై క్రీనీడ‌లు క‌మ్ముకున్నాయి. పార్టీ ఉంటుం దా?  ఊడుతుందా? అనే చ‌ర్చ‌లు కూడా తెర‌మీదికి వ‌చ్చాయి.


ఇలాంటి కీల‌క స‌మ‌యంలో విజ‌య‌వాడ వ‌ర‌ద‌లు వైసీపీకి క‌లిసి వ‌చ్చాయి. ప్ర‌జ‌ల ఇబ్బందుల‌ను ఫోక‌స్ చేయ‌డం లో వైసీపీ ప‌త్రిక బ‌ల‌మైన గ‌ళం వినిపించింది. ఇదేస‌మ‌యంలో అనుకూల మీడియా కూడా బాగానే ప‌నిచేసింది. దీంతో వైసీపీలో కొంత ఊపైతే క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే మార్పు దిశ‌గా వైసీపీ అధినేత జ‌గ‌న్ కూడా చ‌ర్య‌లు తీసుకున్నారు. ప‌లువురు అధికార ప్ర‌తినిధుల‌ను నియ‌మించారు. వీరిలో రోజా, శ్యామ‌ల‌, భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి, ఎస్సీ నాయ‌కుడు జూపూడి ప్ర‌భాక‌ర్ ఉన్నారు.


ఇంత వ‌ర‌కుబాగానే ఉన్నా.. మిగిలిన నాయ‌కుల ప‌రిస్థితిని మాత్రం ప్ర‌స్తావించ‌లేదు. అధికార ప్ర‌తినిధులుగా వీరు మాత్ర‌మే మీడియా ముందుకు రావాల్సి ఉంటుందా?  లేక‌.. ఇత‌ర నేత‌ల‌కు కూడా అవ‌కాశం ఉంటుందా? అనే విష‌యంలోనూ క్లారిటీ ఇవ్వ‌లేదు. పైగా.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు పార్టీ కోసం ప‌నిచేసిన వారిని కూడా ప‌క్క‌న పెట్ట‌డం గ‌మ‌నార్హం. దీంతో మార్పు దిశ‌గా వైసీపీ అడుగులు వేసినా.. వాటిలో లోపాలు కూడా క‌నిపిస్తున్నాయి. మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీ పేరునుప్ర‌స్తావిస్తార‌ని కొంద‌రు భావించారు.


కానీ, ఆమెకు అవ‌కాశం రాలేదు. ఇక‌, కుర‌సాల క‌న్న‌బాబు, దేవినేని అవినాష్‌ల‌ను ప‌క్క‌న పెట్టారు. సామాజిక వ‌ర్గాల ప‌రంగా జ‌రిగిన కూర్పా లేక‌.. సాధార‌ణంగా చేసిన నియామ‌కాలా? అనే విష‌యంపైనా చ‌ర్చ సాగుతోంది. సో.. ఎలా చూసుకున్నా.. వైసీపీలో ఈ నియామ‌కాలు అసంతృప్తిని రాజేలా ఉన్నాయి. ఇక‌, మ‌రింత నాయ‌కులు కూడా ఎదురు చూస్తున్నా.. వారికి ఎలాంటి ప‌ద‌వులు క‌ట్ట‌బెట్ట‌లేదు. దీంతో వారు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. మొత్తానికి కొంత‌లో కొంత వైసీపీలో జోష్ అయితే పెరిగింద‌నే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: