•అప్పుల్లో ఆంధ్రప్రదేశ్..
•అప్పులు తీర్చేదెన్నడు రాష్ట్రం అభివృద్ధి దిశగా అడుగులు వేసేదెన్నడు..
* నెలకు రూ. 11 వేల కోట్లు అప్పు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విభజన తర్వాత అప్పుల్లో కూరుకుపోయిందనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇకపోతే 2024 కొత్త ఆర్థిక సంవత్సరంలో కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కనీవినీ ఎరుగని రీతిలో అప్పులు చేస్తూ అందరిని భయభ్రాంతులకు గురిచేస్తోంది. గత ఆర్థిక సంవత్సరం బకాయిలను కొత్త ఏడాది చెల్లించే విధంగా ఆర్థిక శాఖ అధికారులు ప్రణాళిక రచించడంతో తొలి రెండు నెలల్లోనే విచ్చలవిడిగా అప్పులు చేసేసారు. కేవలం ఏడాది ఏప్రిల్, మే నెలలోనే బహిరంగ మార్కెట్ రుణం మొత్తం రూ.21 వేల కోట్లకు చేరిపోయింది. ఈ స్థాయిలో రుణాలు తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
నిజానికి గతంలో నెలకు రూ .5 వేల కోట్లకు మించి రుణాలు తీసుకున్న సందర్భాలు ఎక్కడా లేవు. కానీ గత ప్రభుత్వ హయాంలో ఆ సంఖ్య రూ.7వేల కోట్లకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా నెలకు రూ.10 వేల కోట్ల రుణాలు సమీకరించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఏప్రిల్ లో పదివేల కోట్లే రికార్డు అనుకుంటే మే నెలలో అది రూ.11 వేల కోట్లకు చేరిపోయింది. ఇలా అయితే ఏడాది మొత్తానికి ఒక్క బహిరంగ మార్కెట్ రుణమే లక్ష కోట్లకు మించి పోతుంది అనడంలో సందేహం లేదు.
ఇకపోతే కిందటి ఏడాది ఆర్థిక చెల్లింపులను చాలావరకు జగన్ ప్రభుత్వం పెండింగ్లో వుంచింది అని సమాచారం. కొత్త ఏడాది అప్పులతో వాటిని చెల్లించవచ్చనే ప్రణాళికే ఇందులో భాగం .ముఖ్యంగా వివిధ డిబిటి పథకాలకు రూ.14 వేల కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇవ్వాలనే ప్రణాళిక రూపొందించినట్లు ప్రభుత్వమే అంగీకరించిన విషయం తెలిసిందే. కేంద్రం ఆరు నెలల్లో రూ.47 వేల కోట్ల రుణ అనుమతులు ఇచ్చింది. ఆ లెక్కన చూసుకున్నట్లయితే నెలకు సగటున ఎనిమిది వేల కోట్ల వరకు అప్పు తీసుకుంది. మొత్తానికైతే పన్నుల రాబడితే మించిపోయి మరీ అప్పులు తీస్తున్న ప్రభుత్వం వాటిని తీర్చే మార్గాలను మాత్రం అన్వేషించట్లేదు. దీనికి తోడు ఇప్పుడు అప్పులు పెరిగిపోతున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం తాము ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను ఏ మేరకు అమలు చేస్తుందో చూడాలి.