అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా 50 రోజులే మిగిలి ఉంది. దీంతో ఎన్నికల ప్రచారం జోరు పెరిగింది. బరిలో ఉన్న అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. ర్యాలీలు, సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. అన్ని వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ తరుణంలో సెప్టెంబరు 10న అమెరికాలో ఓ టీవీ ఛానెల్ అధికార డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్, ప్రతిపక్ష రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మధ్య డిబేట్ ఏర్పాటు చేసింది.


తొలి డిబెట్ అధ్యక్షుడు బైడెన్, ట్రంప్ మధ్య జరిగింది. ఇందులో బైడెన్ తేలిపోయారు. ట్రంప్ దూకుడుకు బైడెన్ సమాధానం ఇవ్వడంలో తడబడ్డారు. తర్వాత అనూహ్యంగా బైడెన్ అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్నారు. తర్వాత రేసులోకి వచ్చిన కమలా హారిస్ తో డిబేట్ కు ట్రంప్ సై అన్నారు. కానీ మంగళవారం జరిగిన డిబెట్ లో ఈ సారి ట్రంప్ తడబడ్డారు. సమాధానం చెప్పలేక ట్రంప్ వ్యక్తిగత విమర్శలకు దిగారు.


ఇక కమల తూటాల్లాంటి మాటలతో ట్రంప్ ను ఇరుకున పెట్టారు. ఆయన దోషి అని నేరం నిరూపితం అయిందని.. ఇంకా అనేక కేసులు పెండింగ్ లో ఉన్నాయని పదే పదే ప్రస్తావించారు. దీంతో ట్రంప్ సమర్థించుకోలేకపోయారు. ఈ తరుణంలో మరో డిబేట్ కు ట్రంప్ ఇప్పుడు జంకుతున్నారు. ఇటీవల జరిగిన డిబెట్ లో కమలా పై చేయి సాధించినట్లు అమెరికా మీడియా కూడా ప్రచారం చేస్తోంది.


సోషల్ మీడియాలో కూడా కమలా మాటలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ నేపథ్యంలో కమలా హారిస్ చర్చకు తాను సిద్ధంగా లేనని ట్రంప్ వెల్లడించడం గమనార్హం. ఈ విషయాన్ని స్వయంగా ట్రంప్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. డిబెట్లో నేను గెలిచాను.. కానీ సర్వేలు మాత్రం భిన్నంగా చూపిస్తున్నాయి. పరాజితురాలు హారిస్ తో మరోసారి చర్చకు తాను సిద్ధంగా లేను అని ట్రంప్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబరు 5న జరగనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: