గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అటు పార్టీలో ఇటు.. ప్రభుత్వంలో నంబర్ టూగా కేటీఆర్ చక్రం తిప్పారు. తర్వాత సీఎంగా పార్టీ నేతలు ఆయన్ను ఫోకస్ చేసుకున్నారు. పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటించారు కూడా. ఇక కేసీఆర్ కూడా తనయుడికే అధిక ప్రాధాన్యం ఇచ్చారు. అప్పుడు మామ చాటు అల్లుడిలా ఆయన బాధ్యతలు నిర్వర్తించిన హరీశ్ రావు ఇప్పుడు చక్రం తిప్నేందుకు రెడీ అయ్యారు.


పార్టీ పై పట్టు కోసం స్పీడ్ పెంచుతున్నారా? వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ.. పార్టీలో కేటీఆర్ కి చెక్ పెడుతున్నారా? పదేళ్లు పవర్లో ఉన్నప్పుడు సర్వం కేసీఆరే అన్నట్లు వ్యవహారం నడిచింది. అధికారం కోల్పోగానే పార్టీపై కేసీఆర్ కూడా పట్టుకోల్పోతున్నారు అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అందుకు తాజాగా జరగుతున్న పరిణామాలనే ప్రజలు చర్చించుకుంటున్నారు. శాసన సభలో ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ మౌనముని అవతారమెత్తారు. బడ్జెట్ సమావేశాల్లో ఒక్క రోజు మాత్రమే హాజరై ఆ తర్వాత అటు తిరగి చూడనే లేదు.


వరదల సమయంలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నా స్పందించలేదు. కేసీఆర్ గ్యాప్ ని హరీశ్ రావు పూడుస్తూ.. ప్రతిపక్ష నాయకుడి అవతారం ఎత్తారు. దూకుడు ప్రదర్శించడంలో.. వాగ్ధాటిలో కానీ హరీశ్ రావు ప్రస్తుతం దూసుకుపోతున్నారు. మీడియా సమావేశాలు, చిట్ చాట్ లు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు, మాట్లాడటం, విమర్శలు సంధించడంలో కేటీఆర్ కంటే కాస్త ముందున్నారు అనే అభిప్రాయం జనాల్లో వ్యక్తం అవుతుంది.


 ఈ సమయంలో అరెకపూడి గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కౌశిక్ రెడ్డిని వెనకేసుకు వచ్చారు. సైబరాబాద్ సీపీ కార్యాలయం ఎదుట పార్టీ నేతలు, ఎమ్మెల్యేలతో ధర్నాకు దిగారు. ఇలా క్యాడర్ లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. అపర చాణక్యుడు అయిన కేసీఆర్ ఇదంతా గమనించకుండా ఉంటారా అంటే కచ్చితంగా కాదనే చెప్పాలి.  ఏది ఏమైనా హరీశ్ దూకుడు క్యాడర్ లో ఉత్సాహం నింపుతోంది. మరి ఇన్నాళ్లూ.. చిన్నబాస్ అనిపించుకున్న కేటీఆర్ తన బావ దూకుడుని ఎలా తట్టుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

brs