* ఆర్ధిక అపర చాణుక్యుడిగా గుర్తింపు పొందిన రోశయ్య
* ఎమ్మెల్యే గా, మంత్రిగా ఎనలేని సేవలు
* ముఖ్యమంత్రి అయిన కొద్ది నెలలకే రాజీనామా.. అప్పుడేం జరిగిందటే..?
రాజకీయ దురంధరుడు కొనిజేటి రోశయ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు....ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుడిగా రోశయ్య మంచి గుర్తింపు సాధించారు.ఆర్థిక అపర చాణక్యుడిగా రోశయ్య తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి బ్యాలెన్స్ చేస్తూ బడ్జెట్ రూపొందించడంలో రోశయ్య ఘనాపాటి.కాంగ్రెస్ పార్టీ తరపున 1968, 1974, 1980లలో శాసనమండలి సభ్యునిగా రోశయ్య ఎన్నికయ్యారు. తొలిసారిగా మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వములో రోడ్డు రహదార్లు శాఖ, రవాణ శాఖల మంత్రిగా పనిచేసారు. ఆ తరువాత అనేక ముఖ్యమంత్రుల హయాంలో పలు కీలకమైన శాఖలు నిర్వహించారు. 2004లో రోశయ్య చీరాల ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004, 2009లో వై.యస్. రాజశేఖరరెడ్డి ప్రభుత్వములో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అసెంబ్లీ లో ఆయన స్పీచ్ కి ప్రతి పక్ష పార్టీలు వణికిపోయేవి.. తన వాగ్దాటికి ఎవరూ కూడా నిలవలేకపోయేవారు. అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనూహ్య మరణం తర్వాత 2009 సెప్టంబరు 3న రోశయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే హైకమాండ్ రోశయ్యను సీఎంగా ఎంపిక చేయడం ఎవరికీ ఇష్టం లేదు. మంత్రులుగా ప్రమాణం చేయడానికి కూడా వారు సిద్ధం కాలేదు. కానీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హెచ్చరిక రావడంతో ఒప్పుకోక తప్పలేదు . అలా ప్రమాణ స్వీకారం చేసిన రోశయ్య ముఖ్యమంత్రి పదవికి 2010 నవంబరు 24న రాజీనామా చేశారు. ఆయన ఆ పదవిలో ఉన్న కాలం 14 నెలల 22 రోజులు. ఈ కాలంలో ఆయన ఎదుర్కొన్న ఒత్తిళ్లు ..చివరికి ఆయన చేత రాజీనామా చేసేలా చేసింది.
రోశయ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే రాష్ట్రాన్ని భారీ వరదలు ముంచెత్తాయి. కానీ వర్షాలు మాత్రం అంతగా లేవు. కృష్ణాకు ఎగువ నుంచి వచ్చిన వరదలతో కనీవినీ ఎరుగని రీతిలో కర్నూలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. ఆస్తి నష్టం భారీగానే జరిగింది. ఆ సమయంలో ప్రభుత్వం ఎంత సహాయం చేసిన విమర్శలు తప్పలేదు..అలా ఆ విపత్తు నుంచి ప్రయాణం ప్రారంభించిన రోశయ్యకు వెంటనే తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఫ్రీజోన్ అంశం రచ్చ లేపింది..పోలీసు ఉద్యోగాల నియామకంలోహైదరాబాద్ ఫ్రీజోనే అని ఏ ప్రాంతం వారైనా ఇక్కడ పోలీసు ఉద్యోగాల్లో చేరవచ్చని హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్ర భావన మరింత ఉదృతం అయింది..దీన్ని అదునుగా తీసుకున్న టిఆర్‌ఎస్ అధినేత చంద్రశేఖరరావు ఆమరణ నిరాహార దీక్ష ప్రకటన చేశారు. దీక్షకు అనుమతించకుడా.. రోశయ్య సర్కారు, కెసిఆర్‌ను మధ్యలోనే అరెస్టు చేసింది. ఇక అక్కడినుంచి తెలంగాణ ఉద్యమం ఉప్పెన లా చెలరేగింది.. ఈ లోపు సీమాంద్రలో కూడా గొడవలు మొదలయ్యాయి.అలా ఊహించని వివాదాలు ఆయన పదవీ కాలం మొత్తం సాగింది. ఇలా ప్రభుత్వ పరంగా.. రాజకీయ పరంగా అన్ని వైపుల నుంచి 14 నెలల పాటు సవాళ్లను ఎదుర్కొన్న రోశయ్య మానసికంగా నలిగిపోయారు. దీంతో ఆయన సీఎంపదవికి రాజీనామా చేసారు ఆతర్వాత తమిళనాడు గవర్నర్ గా కూడా పని చేసారు.