దేశంలో నడుస్తున్న హాట్ టాపిక్స్ లో ఇపుడు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ టాపిక్ ఒకటని చెప్పుకోవాలి. తాజాగా బెయిలు మీద జైలు నుండి రిలీజైన ఈయన తన పదవికి రాజీనామా చేస్తానని చెప్పి దేశ రాజకీయాల్లో కలకలం సృష్టించాడు. ఈ నేపథ్యంలోనే నేడు (మంగళవారం) సీఎం పదవికి రాజీనామా చేయనున్నారు. ఈ మేరకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌ వీకే సక్సెనాను ఇవాళ సాయంత్రం 4.30 నిముషాలకు కలవనున్నారు. ఈ భేటీలో రాజీనామా లేఖను సమర్పించే అవకాశాలు ఉన్నాయని చాలా స్పష్టంగా తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఢిల్లీకి కాబోయే తదుపరి సీఎం ఎవరనే విషయంపైన ఢిల్లీతో పాటు యావత్ దేశం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. కాగా కొత్త సీఎం అభ్యర్థి పేరుని ప్రకటించాక సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయనున్నారని సమాచారం. ఈ విషయమై మధ్యాహ్నం పార్టీ కార్యాలయంలో ముఖ్యమైన కార్యకర్తలతో పాటుగా మంత్రులు, ఎమ్మెల్యేలతో కేజ్రీవాల్ భేటీ కానున్నారు. ఇకపోతే, సీఎం రేసులో మంత్రులు అతిషి, గోపాల్ రాయ్, భరద్వాజ్, గెహ్లాట్ ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రజా తీర్పు తర్వాతే తిరిగి సీఎం పదవిలో కూర్చుంటానని ఇప్పటికే కేజ్రీవాల్ ప్రకటించిన సంగతి విదితమే.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటే ఢిల్లీ ఎన్నికలు నిర్వహించాలని కేజ్రీవాల్ డిమాండ్ చేస్తున్న సంగతి కూడా తెలిసినదే. కాగా షెడ్యూలు ప్రకారం అయితే మాత్రం ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. అయితే తాజా పరిణామంలో కాస్త తొందరగానే ఎన్నికలు వచ్చే అవకాశం లేకపోలేదు. ఇకపోతే ఢిల్లీ లిక్కర్ కేసులో దాదాపు 6 నెలలపాటు కేజ్రీవాల్ జైలులో గడిపిన సంగతి అందరికీ తెలిసినదే. ఈ క్రమంలో కోర్టు షరతులు విధించడంతో సీఎంగా విధుల నిర్వహణకు ఆయన దూరంగా ఉన్నారు. తాజాగా బెయిల్ మీద రిలీజైన ఆయన రెండు రోజుల క్రితం పార్టీ నేతలు, కార్యకర్తలతో భేటీలో తన రాజీనామా వ్యవహారాన్ని ప్రస్తావించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: