తెలంగాణ అధికారంలోకి రావాలని బీజేపీ ఐదేళ్లుగా ప్రయత్నిస్తోంది. అందుకే పార్టీని క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేయడానికి 2020లో పార్టీ పగ్గాలను బండి సంజయ్ కి అప్పగించింది. మాటలతో మాయ చేసే కేసీఆర్ కి చెక్ పెట్టింది బండ్ సంజయ్ మాత్రమే అని అధిష్ఠానం భావించి… అధ్యక్షుడిగా నియమించింది.


తనకు అప్పగించిన బాధ్యతను నూటికి నూరు శాతానికి పైగా బండి సంజయ్ నిర్వర్తించారు. హైదరబాద్ లో మాత్రమే కనిపించే బీజేపీని పల్లె పల్లెకు తీసుకెళ్లారు. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పార్టీకి గతంలో ఎన్నడూ లేనంత మైలేజ్ ని తీసుకొచ్చారు. పార్టీకి వచ్చిన ఊపుతో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని అంతా ఊహించారు. కనీసం రెండో స్థానం అయినా దక్కుతుందని అందరూ అంచనా వేశారు. కానీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు అనూహ్యంగా బండి సంజయ్ ని అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించడం.. అప్పటి వరకు ఉత్సాహంగా ఉరకలెత్తిన పార్టీలో నైరాశ్యం నెలకొంది.


క్యాడర్ డీలా పడింది. దాని ప్రభావం ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. కేవలం ఎనిమిది స్థానాలతో మూడో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. ఇదే సమయంలో కేసీఆర్ కేంద్రంతో కయ్యం పెట్టుకున్నారు. ప్రధాని పదవిపై ఆశతో.. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారు. కానీ అది వికటించడంతో ప్రతిపక్షానికి పరిమితం కావాల్సి వచ్చింది.


 ప్రతిపక్ష స్థానం ఆక్రమించేందుకు బీఆర్ఎస్ కు చెక్ పెట్టాలని బీజేపీ కూడా పెద్ద ఎత్తుగడే వేసింది. జమిలి విధానం ప్రవేశ పెట్టాలని కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఒకవేళ ఇదే విధానం అమల్లోకి వస్తే.. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగుతాయి. దీంఓ ఎన్నికల్లో జాతీయ పార్టీల ప్రభావమే ఎక్కువగా ఉంటుందని బీజేపీ భావిస్తోంది. దీంతో ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యే ఉంటుందని లెక్కలు వేస్తోంది. జమిలి ఎన్నికలతో అధికారం దక్కకపోయినా.. కనీసం ప్రధాన ప్రతిపక్షంగా అయినా నిలుస్తుందని బీజేపీ పెద్దలు లెక్కలు వేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: