తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం తయారీ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు చేసిన కామెంట్లు సంచలనం సృష్టిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో లడ్డూ తయారీలో.. నెయ్యికి బదులు జంతువుల నూనెతో ప్రసాదం తయారు చేశారంటూ చంద్రబాబు సంచలన కామెంట్లు చేశారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తోంది.


దీనిపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ముఖ్యంగా టీటీడీ ఛైర్మన్లుగా పని చేసిన భూమన కరుణాకర్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి లు స్పందించారు. చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ..  కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దివ్య క్షేత్రం తిరుమల ప్రసాదంపై సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలు దుర్మార్గం అన్నారు. రాజకీయ లబ్ధి, స్వార్థం కోసం భగవంతుడిని వాడుకునే వారికి దేవుడు కూడా క్షమించడు అన్నారు. ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు.


వెంకటేశ్వర స్వామి దుష్ట శిక్షణ చేస్తాడని చంద్రబాబు స్వయంగా చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. ఇలాంటి నీచమైన ఆరోపణలు చేసిన వ్యక్తిని భగవంతుడు చూస్తూ ఊరుకోడని హెచ్చరించారు. రాజకీయ ప్రత్యర్థులపై భగవంతుడి పేరు మీద ఆరోపణలు చేయడం చంద్రబాబుకి కొత్త కాదన్నారు కరుణాకర్ రెడ్డి.  గతంలో రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్రయోగించారని గుర్తు చేశారు. ఆ సమయంలో భగవంతుడు శిక్షించాడని.. నాటి అలిపిరిలో గత నన్ను గుర్తు చేశారు కరుణాకర్ రెడ్డి.


వాస్తవానికి తిరుమలలో అన్నప్రసాదాలు తయారు చేసే విషయంలో అధికారుల ప్రమేయం ఉండదు. పవిత్రమైన శ్రీ వైష్ణవుల అమృత హస్తాల మీదుగా ఈ పదార్థాలు తయారు అవుతాయి. అటువంటి వారి హస్తాల మీదుగా తయారయ్యే ప్రసాదాల మీద చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారంటే ఆయన బురద రాజకీయాలకు పరాకాష్ఠ అని భూమన అన్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి తిరుమల తిరుపతి దేవస్థానంపై ఫోకస్ పెట్టారని.. లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. చివరకు స్వామివారి ప్రసాదాలపై సైతం దుష్ప్రచారం చేయడం దారుణమని భూమన మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: