చంద్రబాబు సర్కారు పాలన సెంచరీ కొడుతోంది ఓటమి వంద రోజుల పాలనకు ఎన్ని మార్కులు పడతాయి ?  కూటమి వంద రోజులు పాలన ఎంతవరకు సక్సెస్ అయ్యింది అన్నదానిపై ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాలలోనే కాకుండా.... తెలుగు రాజకీయ వర్గాలలో విస్తృతంగా చర్చ సాగుతుంది. చంద్రబాబు వయసు పెరిగిన అదే ఉత్సాహం.. అదే దూకుడు కనిపిస్తుందన్న‌ మాట ఎక్కువగా వినిపిస్తోంది. అయితే గతంలోలా కాదు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మూడు పార్టీలు ఉన్నాయి.. జనసేన నుంచి ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉన్నారు. దీనికి తోడు బిజెపి కూడా ఆంధ్రప్రదేశ్లో అధికారం పంచుకుంటుంది. ఈసారి పాలనలో చంద్రబాబు మార్క్ కంటే లోకేష్ మార్క్ ఎక్కువగా కనిపిస్తుంది అన్న చర్చ‌ కూడా మొదలైంది.


చంద్రబాబు క్యాబినెట్లో ముగ్గురు నలుగురు సీనియర్లు మిన‌హాయిస్తే మిగిలిన వారంతా లోకేష్ టీం అన్న చర్చ నడుస్తోంది. కొత్తవారిని తీసుకోవడం వెనక లోకేష్ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అన్న చర్చ‌ కూడా వినిపిస్తోంది. చంద్రబాబు 100 రోజుల పాలనకు ఎన్ని మార్కులు అన్న ప్రశ్నకు కచ్చితంగా 100 మార్కులు వేయాల్సిందే. కూటమి అధికారంలోకి రాగానే 4వేలకు పింఛన్ పెంచుతామని హామీ ఇచ్చి నిలబెట్టుకున్నారు. వ‌లంటీర్లు లేకపోయినా ప్రతి నెల ఒకటో తేదీన పింఛన్లు ఇళ్ల‌వద్దకే అందజేస్తున్నారు. ఒకవేళ ఒకటో తేదీ సెలవు దినం అయితే ముందు రోజునే పంపిణీ చేసేలా చంద్రబాబు ఉత్తర్వులు ఇచ్చారు. అలాగే తొలి నెలలో ఏకంగా ప్రతి ఒక్కరికి రు. 7000 పింఛన్ ఇచ్చారు. పింఛన్దారుల మనసు చంద్రబాబు ప్రభుత్వం చూరకొంది అనటంలో ఎలాంటి సందేహం లేదు.


అలాగే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం మెగాడీఎస్సీ మీద పెడతామని చంద్రబాబు - పవన్ కలిసి హామీ ఇచ్చారు. ఈ ఇచ్చిన హామీని కూడా నిలబెట్టుకునే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఏకంగా 16 వేల పోస్టులతో మెగా డీఎస్సీ విడుదలైంది. అలాగే ల్యాండ్‌ టైటిలింగ్ యాక్ట్ రద్దుచేసి రైతులకు భూములపై భయాన్ని పోగొట్టారు. వాస్తవంగా చెప్పాలంటే ఈ చట్టమే జగన్ పరిపాలన పోవటానికి.. జగన్ ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోవడానికి ప్రధాన కారణం అన్న సంగతి తెలిసిందే. ఇక రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతలో 100కు పైగా అన్న క్యాంటీన్ ఏర్పాటు చేశారు. ఇందులో 5 రూపాయలకే టిఫిన్ .. మధ్యాహ్నం, రాత్రి భోజనం పెడుతున్నారు. ఈ అన్న క్యాంటీన్ వల్ల ఎంతోమంది పేదలు రాష్ట్రవ్యాప్తంగా కడుపునిండా భోజనం తింటున్నారు. ఈ విషయంలో కూడా చంద్రబాబు ప్రభుత్వానికి మంచి మార్కులు పడ్డాయి.


అలాగే కార్యకర్తలకు 2014 - 19 మధ్య కాలంలో రావలసిన నీరు చెట్లు బిల్లు క్లియర్ చేయడానికి మొదటి విడతలో 20090 కోట్లు విడుదల చేశారు. వాస్తవంగా చెప్పాలంటే చంద్రబాబు 2014 - 19 మధ్యలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కార్యకర్తలని పట్టించుకోలేదు.. కార్యకర్తలు కూడా ఎన్నో పనులు చేసి బిల్లులు రాక ఆర్థికంగా దెబ్బతిన్నారు. అయితే ఇప్పుడు నాడు కార్యకర్తలు చేసిన పనులకు బిల్లులు విడుదల చేయడం కార్యకర్తలను నిజంగా సంతోష పెట్టింది. అలాగే కార్యకర్తలకు అందుబాటులో ఉండటానికి చంద్రబాబు అప్పుడప్పుడు టిడిపి కేంద్ర కార్యాలయానికి తానే స్వయంగా వెళుతున్నారు. కార్యకర్తలే తనకు ప్రాణమని చంద్రబాబు పదేపదే చెప్పటం వారితో కలవడం ఆకట్టుకుంటుంది. పార్టీ కోణంలో చూసినప్పుడు ఇది చాలా గొప్పది. ఏదేమైనా చంద్ర‌బాబు వంద రోజుల పాల‌న స‌క్సెస్ అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: