తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే హైడ్రాకు చట్టబద్ధతతో సర్వాధికారాలు కల్పించాలని రాష్ట్ర కేబినేట్ నిర్ణయించడం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న చెరువులు, కుంటలు, నాలాలతో పాటు వాటి ఎఫ్.టీ.ఎల్, బఫర్ జోన్ల పరిరక్షణ అధికారాలను హైడ్రాకు అప్పగించడం గమనార్హం. హైడ్రాలో అన్ని ప్రభుత్వ శాఖల నుంచి డిప్యుటేషన్లపై 169 మంది అధికారులను నియమించడంతో పాటు 940 మంది పొరుగు సేవల సిబ్బందిని సైతం నియమించనున్నారు.
అధికారాలలో పూర్తి స్వేచ్చను కల్పించడంతో పాటు మున్సిపాలిటీలు, వేర్వేరు శాఖలకు సంబంధించిన అన్ని అంశాలను హైడ్రాకు అప్పగించడం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్ లోపల 27 అర్బన్ స్థానిక సంస్థలతో పాటు ఈ మధ్య కాలంలో గ్రేటర్ హైదరాబాద్ లో చేరిన 51 పంచాయితీలు సైతం దీని పరిధిలోకి వస్తాయని సమాచారం అందుతోంది. రేవంత్ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో రాష్ట్ర కేబినేట్ సమావేశం 3 గంటల పాటు జరిగింది.
కోఠిలోని మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరును, తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరును, కొత్తగా ఏర్పాటైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును పెట్టాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ సంస్థకు లాజిస్టిక్ పార్క్ కోసం 72 ఎకరాలు కేటాయించామని ఆయన అన్నారు.
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో పారిశ్రామిక పార్క్ కు 58 ఎకరాలను కేబినేట్ కేటాయించింది. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటైన మెడికల్ కాలేజీలలో 3000కు పైగా టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల కోసం అనుమతులు ఇవ్వడం కొసమెరుపు. ఆ పోస్టుల భర్తీకి సైతం త్వరలో నోటిఫికేషన్ జారీ కానుంది. వచ్చే నెల మొదటివారంలో జరిగే సమావేశంలో ఇందిరమ్మ ఇళ్లతో పాటు మిగిలిన అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నారు. తెలంగాణ కేబినేట్ తీసుకున్న నిర్ణయాలపై ప్రశంసల వర్షం కురుస్తోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.