చంద్రబాబు తరచూగా ఒక మాట అంటూ ఉంటారు. సవాళ్లను మేం అవకాశాలుగా మార్చుకుంటాం. ఫైట్ చేస్తాం అని. మరి ఆయన నోట్లో ఏముందో కానీ.. అధికారం చేపట్టిన 100 రోజుల్లో నిజంగానే కూటమి ప్రభుత్వం అనేక సమస్యలు ఎదుర్కొంది. ఈ సమస్యలను చంద్రబాబు సవాళ్లుగానే తీసుకున్నారు.
ఆ విధంగానే పనిచేశారని చెప్పాలి. అధికారంలోకి రాగానే వారం పది రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దుమారం రేగింది. హత్యలు, కొట్లాటలతో రాష్ట్రం అట్టుడికింది. తొలి రోజుల్లో చూసీ చూడనట్టు వ్యవహరించినా తర్వాత వైసీపీ అధినేత జగన్ దూకుడు పెంచి.. దిల్లీలో ధర్నా చేయడంతో చంద్రబాబు స్పందించారు. తమ్ముళ్లకు పదే పదే వార్నింగులు ఇచ్చారు. ఇది ఆయనకు పెద్ద తలనొప్పిగా మారింది. మరో వైపు ఇసుక విషయాన్ని కూడా తమ్ముళ్లు రాజకీయంగా మార్చుకున్నారు. అప్పుడే ఉచిత ఇసుక విధానాన్ని ప్రారంభించారు. కానీ ఇంతలోనే అనంతపురం, ఉభయ గోదావరి జిల్లాల్లో ఇసుక కేంద్రంగా ఇబ్బందులు తెరమీదకి వచ్చాయి. వీటిని కూడా అధిగమించారు.
ఇక.. ఈ వంద రోజుల్లో ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయి. విజయవాడ వరదలు, కాకినాడ జిల్లాలో ఏలేరు సృష్టించిన వరదలతో పాటు ఫస్ట్ ఏలూరు జిల్లాలు ఎర్రవాగు పొంగి గ్రామాలు, పంట పొలాలు నీట మునిగాయి. ఈ సవాళ్ల నుంచి కూడా బయట పడే ప్రయత్నంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఇక కీలకమైన రాజధాని నిర్మాణం.. పోలవరం నిర్మాణానికి సంబంధించి చంద్రబాబు వచ్చీ రావడంతోనే అడుగులు వేయడం ప్రారంభించారు.
వీటికి సంబంధించి కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునే ప్రయత్నంలోనే బడ్జెట్ రూ.15 వేల కోట్లు సాధించేందుకు యత్నించి సక్సెస్ అయ్యారు. ఇవి వచ్చే కొన్ని రోజుల్లోనే రాష్ట్రానికి అందనున్నాయి. ఇక పారిశ్రామికంగా కొంత నష్టం వాటిల్లింది. అనకాపల్లి జిల్లాలోని ఫార్మా సెజ్ లోను.. తర్వాత విశాఖ లోని మరో పారిశ్రామిక వాడలోని సంభవించిన అగ్ని ప్రమాదాల్లో పలువురు మృతి చెందారు. వీరి విషయం కూడా చంద్రబాబుకి సవాళ్లను సృష్టించింది. అయినప్పటికీ చంద్రబాబు ఎదురీదారనే చెప్పాలి. మొత్తానికి చంద్రబాబుకి ఈ వంద రోజుల పాలనలో ఎదురీతలు తప్పకపోవడం గమనార్హం.