కానీ, ఈ విషయంలో వైసీపీ సోషల్ మీడియా తప్పులపై తప్పులు చేస్తోంది. ఎన్నికలకు ముందు అంటే.. ఏదో ప్రచారం కోసం ఇలా చేస్తున్నారులే అని అనుకుని సరిపుచ్చుకోవచ్చు. కానీ, ఎన్నికలు అయిపోయాక, ఫలితం వచ్చేశాక కూడా.. వైసీపీ తీరు మారినట్టుగా లేదు. అమరావతిలో వరదలు వచ్చేశాయని.. మునిగిపోయిందని కొన్నిరోజుల కింద పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కృష్ణానదికి వచ్చిన వరద నీరును దిగువకు వదలకుండా.. చేసి..విజయవాడను ముంచేశారని మరో ప్రచారం చేశారు. ఈ రెండు ప్రచారాలు కూడా బూమరాంగ్ అయ్యాయి.
ఎక్కడో మయన్మార్‌లో సంభవించిన వరదలను అమరావతికి అంటగట్టి చూపించారంటూ దుమారం రేగింది. అంతేకాదు.. ఆధా రాలతో సహా టీడీపీదీనిని నిరూపించింది. దీనిని చూసిన తర్వాతైనా.. వైసీపీ సోషల్ మీడియా కొంతైనా మారి ఉంటే బాగుండేది. కానీ, ఇప్పుడు కూడా మారలేదు. తాజాగా మంత్రి సుధారాణి తన పుట్టిన రోజు వేడుకలు తిరుమలలోని ఓ గెస్ట్ హౌస్ లో థూం..థాంగా జరిగాయని అందరూ తాగి గంతులేశారని వైసీపీ సోషల్ మీడియాలో ఓ వీడియోను ప్రచారంలోకి పెట్టారు.ఈ వీడియో వైరల్ అయింది. అయితే.. ఈ ప్రచారం కూడా నవ్వులపాలైంది.
ఇలాంటి వీడియోలు, వ్యతిరేక ప్రచారాలతో వైసీపీ కూడగట్టుకునే ప్రజాభిమానం ఏంటనేది ఇప్పుడు చర్చ. పైగా ఒకవైపు మాట కుదరడం లేదన్న వాదన జగన్ విషయంలో మరింత బలపడుతోంది. ఇలాంటి సమయంలో సోషల్ మీడియా వైసీపీకి దన్నుగా మారి ఆదుకోవాల్సి ఉంది. కానీ, ఈ పనిమానేసిన వైసీపీ సోషల్ మీడియా లేనిపోని అభూత కల్పనలతో ఇలా కాలక్షేపం చేస్తూ ఉంటే.. ఎప్పటికి పార్టీ పుంజుకుంటుంది? మూడు మాసాలైనా పురోగతి లేని పరిస్థితి నుంచి ఎప్పటికి బయటకు వస్తుంది? అన్నది వైసీపీ ఆలోచించుకోవాలి. అప్పుడు మెరుగుదల సాకారం అవుతుంది. లేకపోతే ఇంతే!!