ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేరు తెలియని వారు ఉండరు. గంటా శ్రీనివాసరావు ది పాతికేళ్లకు పైగా రాజకీయం. ప్రతి ఎన్నికకు నియోజకవర్గ మారుతూ వచ్చే గంటా చాలాసార్లు పార్టీలు మారారు. అయితే ఎన్నికలలో గంటా ఒక్కసారి కూడా ఓడిపోలేదు. 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో చిత్తుచిత్తుగా ఓడిపోయినా కూడా గంటా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఒకసారి ఎంపీగా, ఐదుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా పనిచేసిన గంటా రాష్ట్ర రాజకీయాలలో కీలక నేతగా ఎదిగారు.


ఆయన గెలిచిన ప్రతిసారి మంత్రి అవుతూ వచ్చారు. ప్రజారాజ్యం నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లి మంత్రి అయిన గంటా.. వెంటనే తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మరోసారి మంత్రి అయ్యారు. అయితే ఈసారి మాత్రం గంటాకు ఛాన్స్ దక్కలేదు. గంటాకు ఛాన్స్ దక్కకపోవటానికి ప్రధాన కారణం లోకేష్ అన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గంటా అసలు పోరాటం చేయలేదు.


ఇక ఇప్పుడు ఆయన వియ్యంకుడు నారాయణకు మంత్రి పదవి ఇవ్వడంతో.. గంటా  వైపు ఎవరూ చూడటం లేదు. అయితే గంటా ఇప్పుడు ప్రతిసారి మీడియా ముందుకు వచ్చి జగన్‌పై విమర్శలు చేస్తున్నారు. వైసీపీ మునిగిపోయే నావ అని.. ఆ పార్టీలో జగన్ తప్ప ఎవరూ ఉండరని విమర్శించిన గంటా.. జగన్ పార్టీని రద్దు చేయమని.. ఎన్నికల సంఘాన్ని కోరుతామని చెబుతున్నారు. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో నాణ్యతలో లోపాలు వైసీపీ ప్రభుత్వ హయంలో జరిగాయని.. దానికి బాధ్యత వహించి జగన్ నైతికంగా పార్టీ నుంచి తప్పుకోవాలని.. వైసీపీని రద్దుచేస్తే రాష్ట్రానికే కాదు.. దేశానికి కూడా మంచిదని గంటా సూచనలు చేస్తున్నారు.


ఏది ఏమైనా గంటా కేవలం మంత్రి పదవి టార్గెట్గా పెట్టుకుని జగన్ పై బాగా విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఆయన రాజకీయం దగ్గర నుంచి చూస్తున్నా వారు మంత్రి పదవి కోసం గంటా జగన్‌ను టార్గెట్ చేస్తున్నారని.. ఆయనకు జగన్ తిట్టే శాఖ మంత్రి పదవి ఇస్తే సరిపోతుందని సెటైర్లు వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: