నటి అరుణ నలుగురు అమ్మాయిలకు తల్లి. ఆమె సినిమాలో నటిస్తున్నప్పుడు తన కలువ కళ్లతో ప్రేక్షకులను వెండితెరకు కట్టిపడేసింది. ఈమె మంచి నటి మాత్రమే కాదు మంచి తల్లి కూడా. తన నలుగురు అమ్మాయిలను చాలా గొప్పగా పెంచింది. ఇండస్ట్రీలో ఆమె పదేళ్లపాటే కొనసాగింది కానీ 70 సినిమాల్లో నటించి ఆశ్చర్యపరిచింది. అత్తింటి వారు సినిమాలు వద్దమ్మా అని చెప్పడంతో వారి మాటకు గౌరవమిచ్చి ఇండస్ట్రీకి దూరమైపోయింది. తెలంగాణ రాష్ట్రం కొత్తగూడెం జిల్లాలో ఈమె జన్మించింది. మోహన్ గుప్తా అనే వ్యక్తిని ప్రేమించి 1987లో పెళ్లి చేసుకుంది. వారికి మొత్తం నలుగురు ఆడపిల్లలు పుట్టారు. దీనివల్ల అయ్యో ఇప్పుడు కూడా అమ్మాయేనా? ఒక్క మగ పిల్లాడు కూడా లేకపోతే వంశం ఏమైపోతుంది అంటూ అందరూ వారిని సూటిపోటి మాటలు అనేవారట.
చివరికి అత్తగారు కూడా ఒక్క మగపిల్లాడిని కనివ్వమ్మా అని ఒత్తిడి చేసిందట. దీనివల్ల ఆమె నలుగురును కన్నది. ఆ నలుగురు కూడా సిజేరియన్ ద్వారా కన్నపిల్లలే. వారందరూ అమ్మాయిలు కావడంతో ఇంటా బయటా పోరు పడాల్సి వచ్చేది. అమ్మాయి పుట్టిందంటే మహాలక్ష్మి అనో, లేదంటే ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వీరనారి పుట్టిందని అనుకోవచ్చు. కానీ బయట వ్యక్తులు మాత్రం అమ్మాయి అంటే బరువు, బాధ్యతగా చూస్తారు. ఈ రోజుల్లో గర్ల్స్ సముద్రాలను ఈదేస్తున్నారు, చంద్రమండలాల్లోకి వెళ్లిపోతున్నారు. అబ్బాయిల కంటే అమ్మాయిలే తల్లిదండ్రులను మంచిగా చూసుకుంటున్నారు. కానీ కామాంధులు ఎక్కువ కావడం వల్ల వారిపై దాడులు జరుగుతున్నాయి. ఇదొక్కటే అమ్మాయి తల్లిదండ్రులకు కలిగే బాధ. దీన్ని నటి అరుణ ఒప్పుకుంది.
"ఎవరు ఎలాంటి మాటలు అన్నా సరే నేను పట్టించుకోను. మా కూతుర్లే మాకు కొండంత బలం. మా పెద్ద కూతురు శిఖా ఎంబీఏ కంప్లీట్ చేసింది. రెండో అమ్మాయి పేరు యాశ్వీ, ఆమె ఓ ఆర్కిటెక్ట్. మూడో కూతురు పేరు శోభిత, లాయర్ గా ప్రాక్టీస్ చేస్తోంది. నాలుగో కూతురు రియా డాక్టర్ అయింది. వారిని ఈ ఉన్నత చదువులు చదవమని మేము చెప్పలేదు. వారికి ఇష్టమయ్యే ఆయా రంగాల్లో స్థిరపడ్డారు. ఒక్క కెరీర్ విషయంలో మాత్రమే కాదు కట్టుబొట్టు, వస్త్రధారణ విషయంలో కూడా మేము ఆంక్షలు పెట్టింది లేదు..."
"మా అమ్మ చనిపోయిన తర్వాత అమెరికాలో ఉంటున్న పెద్దమ్మాయి ఇంటికి వెళ్లాను. అక్కడ బట్టలను ఇండియాలో లాగానే ఆరేశాను. అయితే అలా చేయకూడదు అమ్మా అని మా పెద్దమ్మాయి చెప్పింది. అయినా సరే నేను అలాగే చేస్తానని చెప్పా. అప్పుడు 'నువ్వు ఇలాగే చేస్తే ఇది ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తాను' అని చెప్పింది. అన్నట్లుగానే అలాగే చేసింది. అది చాలా వైరల్ అయింది కూడా. అయినా నేను ఎక్కడున్నా భారతీయ మహిళగా సింపుల్ గా ఉండటానికి ఇష్టపడతాను. ఆ సింపుల్ లైఫ్ ను మా అమ్మాయి వీడియో తీసి ఇన్‌స్టాలో షేర్ చేయడం మొదలు పెట్టింది. వాటిని పెద్దవాళ్లే చూస్తారని అనుకున్నా. కానీ యంగ్ లేడీస్ కూడా వాటిని చూస్తున్నారు. ఓసారి ఓ 18 ఏళ్ల అమ్మాయి నా వద్దకు వచ్చి 'మీ వీడియోలు చూస్తాను మేడం, మిమ్మల్ని చూసి ఎంతో ఇన్స్పైర్ అయ్యాను' అని చెప్పింది. అప్పుడు ఎంతో సంతోషంగా అనిపించింది. మా అమ్మాయిలే నాకు మంచి స్నేహితులు. 'మీకు అందరూ ఆడపిల్లలే' అని నన్ను డిసప్పాయింట్ చేయడానికి చాలామంది ప్రయత్నించారు కానీ ఆ నలుగురు పిల్లలకు తల్లిగా ఉండటమే నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది " అని నటి అరుణ చెప్పుకొచ్చింది.