- అమెరికాలో పెరుగుతున్న జాత్యాహంకార హత్యలు ..
- బలవుతున్న ఎంతోమంది తెలుగు విద్యార్థులు..
సముద్రాలు దాటి గగన తలంలో ప్రయాణం చేసి ఎన్నో ఆశలతో అమెరికాలో అడుగు పెడుతున్నారు ఎంతోమంది తెలుగు విద్యార్థులు. అగ్రరాజ్యంలో ఉద్యోగం చేసి వారి కుటుంబాలను అగ్రభాగంలో ఉంచాలని అనుకుంటున్నారు. దీంతో కొంతమంది విద్యార్థులు ఆస్తులు కూడా అమ్ముకొని అగ్రరాజ్యానికి ప్రయాణం అవుతున్నారు. అలా వెళ్ళిన వారికి అక్కడ అన్ని రకాల సదుపాయాలు దొరకడం లేదని చెప్పవచ్చు. కొంతమంది జాత్యహంకార హత్యలకు గురై మరణిస్తున్నారు. ఇలా ఇప్పటివరకు వందలాదిమంది విద్యార్థులు కాల్పుల్లో మరణించారు. కొన్ని కాల్పులు అనుకోకుండా జరిగిన వైతే మరికొన్ని కాల్పులు ఇండియన్స్ పై కావాలనే చేస్తున్నవి ఉన్నాయి. ఈ విధంగా ఎంతోమంది తెలుగు విద్యార్థులు అమెరికన్ దుండగుల చేతిలో మరణిస్తున్నారు. ఉద్యోగాలు చేసి తల్లిదండ్రుల కీర్తి ప్రతిష్టలు కాపాడుతామని వెళ్లిన విద్యార్థులు తిరిగి శవాలై ఇంటికి వస్తున్నారు. అమెరికా కాల్పుల్లో ఎందుకు చనిపోతున్నారు.. భారతీయులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటో ఇప్పుడు చూద్దాం.
పగబడుతున్న అమెరికన్లు:
ఇండియా నుంచి అమెరికాకు పయనమై అద్భుతమైన ప్రతిభ కనబరిచినటువంటి తెలుగు విద్యార్థులపై అమెరికావారు పగబడుతున్నారట. వాళ్లకంటే ముందు ఇండియన్స్ ఉద్యోగాలు పొందడంతో కక్ష పెంచుకుంటున్న అమెరికన్స్ ఏదో ఒక విధంగా తెలుగు విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారట. కొన్ని కొన్ని సందర్భాల్లో కాల్పులు కూడా జరిపి హత్య చేస్తున్నారని తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో ఏపీలోని బాపట్ల జిల్లాకు చెందిన దాసరి గోపికృష్ణ (32) దుండగుల కాల్పుల్లో మరణించాడు. కర్లపాలెం మండలం యాజలికి చెందిన గోపికృష్ణ దాదాపు పది నెలల క్రితం అమెరికా వెళ్లారు. టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ లోని ఓ సూపర్ మార్కెట్లో ఉద్యోగం చేస్తున్నాడు. మధ్యాహ్న సమయంలో ఆయన పనిలో ఆయన ఉండగానే ఒక దుండగుడు డైరెక్ట్ గా వచ్చి తలపై తుపాకీ పెట్టి కాల్పులు జరిపేసాడు. దీంతో గోపికృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విధంగా అమెరికాలో ఎంతోమంది తెలుగు విద్యార్థులు దుండగుల చేతిలో మరణిస్తున్న ఘటనలు అనేకం చూస్తున్నాం. అలా అమెరికాకు వెళ్లిన వారంతా ఎన్నో కలలు కని కొలువులు సాధించి కుటుంబాన్ని ఇబ్బందులు లేకుండా చూసుకుందామంటే వారి ఆశలు అడియాశలైపోయి చివరికి అంతిమ సంస్కారాల కోసం ఇండియాకు వస్తున్నారు.