ఇక బయటకి వెళ్ళినవారు సైలెంటుగా ఉంటున్నారు అంటే.. ఉండడం లేదనే చెప్పుకోవాలి. వెళ్ళిన వారు అంతా జగన్ మీద నిందలు వేసిమరీ వెళ్తున్నారు. వీరికి ఇన్నేళ్ళ పాటు నచ్చిన జగన్ ఇపుడు ఎందుకు చెడ్డ అయిపోయారో అర్థం కావడం లేదు అని జగన్ సన్నిహితులు, కార్యకర్తలు వాపోతున్న పరిస్థితి. అయితే జగన్ ఎపుడూ ఒకేలా ఉన్నారని, ఆయన మారింది లేదని, వెళ్లిపోయిన వారే వెన్నుపోటు పొడుస్తున్నారని సన్నిహితంగా ఉన్న వారు చెబుతున్న మాట. వారిని అందలం ఎక్కించి పెద్దల సభకు పంపిస్తే, ఇపుడు వారు చాలా ఈజీగా వైసీపీ జెండాను పీకేస్తున్నారు అని మండిపడుతున్నారు.
సాధారణంగా పదవులు తీసుకున్న వారు పార్టీలో ఉంటారు. పోయిన వారే బయటకి పోతారు. కానీ వైసీపీలో ముగ్గురు రాజ్యసభ సభ్యులు తమ పదవులు వదిలేసుకుని మరీ వెళ్లిపోవడం ఇపుడు పార్టీని కలచి వేస్తోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదే క్రమంలో మిగిలిన ఎమ్మెల్సీలూ కూడా అదే రూట్లో ఉన్నారని వినికిడి. వీరి తీరే ఇలా ఉంటే మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేల సంగతి ఊహించగలమా? అన్న చర్చ ఇపుడు నడుస్తోంది. ఇదంతా జగన్ చేసుకున్నదేనా లేక రాజకీయమే అలా ఉందా అన్నది? ఇపుడు ఆలోచించాల్సిన విషయం. ఆ విషయంలో టీడీపీ బెటర్ అని అంటున్నారు కొంతమంది విశ్లేషకులు. అయిదేళ్ల క్రితం పార్టీ దారుణంగా ఓడింది. కానీ ఎవరూ బయటకు పెద్దగా రాలేదు. దానికి కారణం చంద్రబాబు అనుసరించిన విధానమే అని అంటున్నారు.