కట్ చేస్తే ఇప్పుడు వైసీపీతో పాటు.. రాజ్యసభ సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేసేసారు. కృష్ణయ్య తదుపరి అడుగులు ఎటువైపు పడుతున్నాయి.. ఆయన తాను ప్రకటించినట్టుగానే కొత్త పార్టీ ఏర్పాటు చేస్తారా.. లేదా.. బిజెపిలో చేరుతున్నారా అన్నదానపై చర్చలు నడుస్తున్నాయి. మోపిదేవి వెంకటరమణ వైసీపీని వీడిన సమయంలోనే.. కృష్ణయ్య రాజీనామా పై స్పందిస్తూ తాను వైసీపీనీ ఎట్టి పరిస్థితుల్లో విడనని చెప్పి నెల రోజులు కూడా కాకుండానే జగన్‌కు బిగ్ హ్యాండ్ ఇచ్చేశారు. తాజా సమాచారం ప్రకారం కృష్ణయ్య బీజేపీలో చేరేందుకు సంప్రదింపులు జరిగాయని.. కాషాయ కండువా కప్పుకునేందుకు లైన్ క్లియర్ అయిందని రాజ్యసభ ఇస్తామన్న హామీతోనే ఆయన వైసీపీతో పాటు.. ఆ పార్టీ నుంచి వచ్చిన రాజ్యసభ పదవిని కూడా వదులుకున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే తెలంగాణ బీజేపీలో బీసీ నేతల గోల ఎక్కువైంది అన్న చర్చ జరుగుతోంది. ఆర్ కృష్ణయ్యను బిజెపిలో చేర్చుకునేందుకు ఆసక్తి చూపించడం వెనక ఒక చర్చ కూడా నడుస్తోంది. తెలంగాణలో బీజేపీ, బీసీ నినాదం వినిపిస్తోంది. దీనిని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అడ్వాంటేజ్‌గా తీసుకొని ప్రయత్నిస్తున్నారు అని సీనియర్లు గుర్రుగా ఉన్నారట. తెలంగాణ బీజేపీ బీసీ నేతలు బండి సంజయ్, ఈటెల వర్గాలుగా విడిపోయారు. ఈ క్రమంలోనే ఈటెలకు చెక్ పెట్టేందుకు బండి సంజయ్ వర్గం ఆర్ కృష్ణయ్యను తెరమీదకు తెచ్చింది అనే వాదనలు వినిపిస్తున్నాయి.