పార్టీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత వైసీపీ అధినేత జగన్ చిన్నచిన్నగా మరమ్మతులు చేసుకుంటూ వస్తున్నారు. జగన్ ఊహించని విధంగా తాను వరుసగా రెండోసారి అధికారం లోకి వస్తాను అని ధీమా గా ఉన్నారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం కావాల్సిన పరిస్థితి. ఇప్పుడు రియలైజ్ అయిన జగన్ పార్టీ కి మరమ్మతులు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీమంత్రులు పార్టీ కోసం నమ్ముకుని ఉన్నకీలక నేతలకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్న మూడు జిల్లాలకు కీలక నేతలను పిలిచి మరియు బాధ్యతలు అప్పగించారు. విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడుగా మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ కి పగ్గాలు అందించారు. ఆయనకు ఇది పాత అనుభవమే.
గతంలో వైసిపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అమర్నాథ్ విశాఖ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన యువ నాయకుడుగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. అందుకే తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినా కూడా జగన్ మంత్రి పదవి కూడా ఇచ్చారు. అనకాపల్లి జిల్లాకు మరో మాజీ మంత్రి .. ఈ ఎన్నికల్లో అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన మాడుగుల మాజీ ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడుకు పగ్గాలు అప్పగించారు. ఆయన మరో ప్రధాన వెలమ సామాజిక వర్గానికి చెందిన వారు కావడం విశేషం.
ఇక అరకు జిల్లా పార్టీ బాధ్యతలు పాడేరు ఎమ్మెల్యే మత్సరాశ విశ్వేశ్వర రాజుకు అప్పగించారు. ఆయన ఎమ్మెల్యే గా కూడా ఉండడంతో పార్టీని మన్యం .. ఏజెన్సీ ప్రాంతంలో సమర్థ వంతంగా నడప గలరన్న విశ్వాశంతోనే జగన్ ఆయనకు బాధ్యతలు అప్పగించారు. జగన్ ఏదైనా పార్టీని నమ్ముకుని.. తనపై నమ్మకం పెట్టుకున్న వారికి మంచి పదవులు ఇచ్చారనే చెప్పాలి.