రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 2017లో సాగునీటి సంఘాల ఎన్నికల జరిగాయి. ఆ తర్వాత 2019లో వైసీపీ ప్రభుత్వం సాగునీటి సంఘాలను పట్టించుకోలేదు. అలాగే 2020లో సాగునీటి సంఘాలు వ్యవస్థని రద్దు చేశారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వ మరోసారి అధికారంలోకి రావడంతో సీఎం చంద్రబాబు సాగునీటి సంఘాల ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 9 సంవత్సరాల తర్వాత ఎన్నికల నిర్వహణ కోసం ఉత్తర్వులు కూడా ఇచ్చారు. మొత్తం 49,20 ప్రాదేశిక నియోజకవర్గలు, 6,149 సాగునీటి వినియోగదారుల కమిటీల పరిధిలో ఎన్నికలు జరగనున్నాయి.
అయితే ఈ సాగునీటి సంఘాల ఎన్నికలు మూడు దశల్లో జరగనున్నాయి. మొదటి దశలో నీటిసంఘాలు ఎన్నికలు,ఈ ఎన్నికల ద్వారా ఆరుగురు డైరెక్టర్లను ఎన్నుకుంటారు. ఆరుగురు డైరెక్టర్లలో నుంచి ఓ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడులను ఎన్నుకుంటారు. రెండో విడతలో నీటి సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు కలిసి డిస్ట్రిబ్యూటరీ కమిటీలను ఎన్నుకుంటారు. మూడో విడతలో డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షులు కలిసి జిల్లా ప్రాజెక్టు కమిటీ చైర్మన్, ఉపాధ్యక్షుడు, డైరెక్టర్లను ఎన్నుకుంటారు. ఈ కమిటీల పర్యవేక్షణలో డ్రైయినేజీ వ్యవస్థ, పూడికతీత, తట్టమట్టి తొలగింపు, పంట కాల్వల ఆధునీకరణ వంటి పనులు చేపడతారు. ఇలాంటి కీలకమైన సాగునీటి సంఘాలకు తిరిగి ఎన్నికలు నిర్వహిస్తూ ఉండటంతో రైతుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.