మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు వేరు. ఇప్పుడు మరోలా మారాయి. మొన్నటి వరకు హైడ్రాను స్వాగతించిన వారంతా ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు. పెద్దలను వదిలి పేదల జోలికి వస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అటు బాధితులు సైతం లబోదిబోమంటున్నారు. వారికి ప్రతిపక్షాల కూడా తోడయ్యాయి.


ప్రభుత్వ చర్యలన్నీ విమర్శిస్తున్నాయి. రాష్ట్రంలో బుల్డోజర్ల రాజ్యం నడుస్తోందంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టి ఏడాదైనా కాకముందే హైడ్రా అంశంలో ఇప్పుడు అపవాదులు ఎదుర్కొంటున్నారు. హైడ్రా వ్యవస్థపై ముందు నుంచి బీఆర్ఎస్, బీజేపీలు విమర్శిస్తూ ఉన్నాయి. ఇరు పార్టీల నేతలు ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని నిలదీస్తూ వస్తున్నాయి. పేదల జోలికొస్తే ఊరుకోబోమంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నా రేవంత్ రెడ్ఇ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. తాజాగా మూసీ బాధితుల అంశం నగరంలో భారీ ఎత్తున వివాదానికి తెర తీసింది. మూసీ ప్రక్షాళనలో భాగంగా అక్కడి పరిసర ప్రాంతాలను ఖాళీ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.


దాంతో వారికి 15 వేల డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయించింది. తమ నివాసాలను ఖాళీ చేసి డబుల్ బెడ్ రూం ఇళ్లకు షిఫ్ట్ అయిపోవాలని సూచించింది. అలాగే స్థలానికి సంబంధించి కూడా పరిహారం ఇస్తామని చెప్పింది. కానీ కొంత మంది బాధితులు ఒప్పుకున్నా.. మరికొందరు మాత్రం ససేమిరా అంటున్నారు. దశాబ్ధాలుగా ఉంటున్న తమకు అన్యాయం చేయొద్దని వారు మొర పెట్టుకుంటున్నారు.


అయితే ఇప్పటి వరకు హైడ్రా విషయంలో ప్రతిపక్షాల నుంచి వాయిస్ వినిపించింది. ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్ హైడ్రా కూల్చివేతలపై స్పందించారు. మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇళ్లను కూల్చడం సరికాదని అన్నారు. పేదల ఇళ్ల జోలికి పోవద్దని గతంలో తాను హైడ్రాకు చెప్పినట్లు పేర్కొన్నారు. ముందు కౌన్సిలింగ్ ఇచ్చి.. ఆ తర్వాత ఖాళీ చేయిస్తే బాగుండేది అని అభిప్రాయపడ్డారు. అంతేకాదు.. కూల్చాల్సి వస్తే.. ఐమాక్స్, జల విహార్ లను కూల్చాలని బాంబ్ పేల్చారు. అంతేకానీ.. స్లమ్ లలో ఉండే పేదలను ఇబ్బంది పెట్టొదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి దానం వ్యాఖ్యలపై పార్టీ పెద్దలు, సీఎం రేవంత్ ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: