లక్ష్యాన్ని మించి మొక్కలు నాటిన తెలంగాణ ప్రజలపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ఏక్ పేడ్ మా కే అమ్మ పేరిట ఒక మొక్క కార్యక్రమంలో భాగంగా రికార్డు స్థాయిలో మొక్కలు నాటారని పేర్కొంటూ రాష్ట్ర ప్రజలకు అభినందనలు తెలిపారు. దేశ ప్రజల్ని ఉద్దేశించి రేడియోలో మోదీ మాట్లాడే మన్ కీ బాత్ తాజా ఎపిసోడ్ తాజాగా ప్రసారం అయింది.


పర్యావరణ పరిరక్షణ కోసం ప్రారంభించిన ఏక్ పేడ్ మా కే నామ్ కార్యక్రమాన్ని ఈ సందర్భంగా మోదీ ప్రస్తావించారు. ప్రజల భాగస్వామ్యానికి ఈ కార్యక్రమం చక్కని ఉదాహరణని, ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచిందన్నారు. తెలంగాణకు చెందని కేఎన్ రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా ఆయన నాలుగేళ్లుగా ప్రతి రోజు మొక్క నాటారని, రాజశేఖర్ కు ఉన్న నిబద్ధత తనతో సహా అందర్నీ ఆశ్చర్య పరుస్తుందని మోదీ తెలిపారు.


మొక్కలు నాటే కార్యక్రమాన్ని రాజశేఖర్ ఒక ఉద్యమంలాగా, కఠిన మైన వ్రతంలా నిర్వహించారని కొనియాడారు. ఈ ఏడాది ప్రమాదానికి గురైన తర్వాత కూడా ఆయన ధృఢ సంకల్పాన్ని వదలకపోవడం అత్యంత గొప్ప విషయాన్ని ప్రశంసించారు. రాజశేఖర్ కు హృదయ పూర్వకంగా అభినందనలు తెలిపారు.


తెలంగాణ, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు లక్ష్యానికి మించి మొక్కలు నాటి సరికొత్త రికార్డు సృష్టించాయని మోదీ తెలిపారు. బుధవారం నాటికి దేశ వ్యాప్తంగా 80 కోట్ల మొక్కలు నాటడం ద్వారా లక్ష్యాన్ని సాధించామని కేంద్ర పర్యావరణ శాఖ తెలిపిందని గుర్తు చేశారు. ప్రజలు మసాలా వార్తలు, నెగెటివ్ విషయాల పట్ల మాత్రమే ఎక్కువ ఆసక్తి చూపుతారన్న అభిప్రాయాన్ని మన్ కీ బాత్ తప్పని నిరూపించిందని మోదీ పేర్కొన్నారు. పాజిటివ్ వార్తలు, స్ఫూర్తి దాయక కథనాలనే ప్రజలు ఇష్టపడతారని అది నిరూపించిందన్నారు. మన్ కీ బాత్ కు పదేళ్లు పూర్తయ్యాయని గుర్తు చేస్తూ.. తాజా ఎపిసోడ్ తో తాను భావోద్వేగానికి గురవుతున్నారన్నారు.  ఇటీవల తన అమెరికా పర్యటనలో ఆ దేశ ప్రభుత్వం భారత్ కు చెందిన పలు ప్రాచీన కళాఖండాలను తనకు తిరిగి అప్పగించిందని, వీటిలో కొన్ని 4000 ఏళ్ల కిందటివనే మోదీ తెలిపారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: