- నిషేధిస్తే ఆర్థికంగా వెనక్కి..
- తెలంగాణ తాగుబోతుల అడ్డాగా మారిందా.?
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత వైన్ షాప్ ల సంఖ్య పెరిగింది. అంతేకాదు విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఎంతోమంది మద్యం వ్యాపారులు సొమ్ము చేసుకుంటూ వస్తున్నారు. ఇక కెసిఆర్ పదేళ్ల పాలనలో మద్యం ఏరులై పారింది. రాష్ట్రానికి ప్రధాన ఆదాయవనరు మద్యమే అయిపోయింది అని చెప్పవచ్చు. ఓ వైపు మద్యం తాగిస్తూనే మరోవైపు మద్యం షాపు నుంచి బయటకు వచ్చాక పోలీసులు పట్టుకొని ఫైన్లు వేయడం ఇలా కెసిఆర్ హయాంలో నుంచే జరుగుతూ వచ్చింది. ఇక తెలంగాణలో ప్రతి గ్రామంలో గల్లి గల్లీకి ఒకటి నుంచి రెండు బెల్ట్ షాపులు వెలిసాయి. ఇలా మద్యం అమ్మకాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగింది. అలాంటి మద్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిషేదిస్తామని చెప్పుకుంటూ వచ్చింది. మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మద్యపాన నిషేధంపై ఫోకస్ పెట్టిన దాఖలాలు లేవు. కెసిఆర్ హయాంలో ఎలా అయితే మద్యం ఏరులై పారిందో.. ఇప్పుడు కూడా ఆ విధంగానే మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..
తెలంగాణ మద్యం అమ్మకాలు:
తెలంగాణ రాష్ట్రంలో మద్యం రేట్లు ఎంత పెరిగినా కానీ తాగే వారి సంఖ్య తగ్గడం లేదు. ఇలా ప్రతి ఏటా ఎంతోమంది మద్యానికి బానిసై అనేక రోగాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా మైనర్ పిల్లలు కూడా మద్యానికి బానిసలవుతున్నారు. నిబంధనలు మొత్తం వైన్స్ యజమానులు గాలికి వదిలేసి, బెల్ట్ షాపులకు అత్యధిక మద్యాన్ని అందించడంతో మైనర్లకు కూడా మద్యం అందుబాటులోకి వస్తోంది. దీంతో వారు కూడా తాగుడుకు అలవాటు పడి వారి జీవితాన్ని చేతులారా పాడు చేసుకుంటున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చారు. దీనివల్ల పేద ప్రజలకు కాస్త మేలు జరుగుతుంది కావచ్చు.కానీ వారి ఆరోగ్యం విషయంలో మాత్రం కీడు జరుగుతుందని చెప్పవచ్చు. ఇంతకుముందు లిమిట్లో తాగేవారు ఇప్పుడు అదే డబ్బులతో లిమిట్ లెస్ గా తాగుతారు. దీనివల్ల వారికి సేవ్ అయ్యేది 100 అయితే ఆస్పత్రి కి వెళ్తే ఖర్చయ్యేది 1000 అని చెప్పవచ్చు. ఇలా మద్యం రేట్లు తగ్గిస్తే తప్పక తాగుబోతులు పెరుగుతారని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. ఏపీ పాలసీని తెలంగాణలో కూడా తీసుకురావాలని మందు బాబులు గుసగుసలు పెట్టుకుంటున్నారు. ఇలా ఏ విధంగా అయినా సరే ప్రజలతో మద్యం తాగించి సొమ్ము చేసుకోవాలని ప్రతి ప్రభుత్వం ట్రై చేస్తూనే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యంలో ఏదైనా మార్పు వస్తుంది అని అనుకున్నారు. కానీ ఎలాంటి మార్పు లేకపోవడంతో ఈ ప్రభుత్వం కూడా కేసీఆర్ ప్రభుత్వం లాగే ఉందని సీనియర్ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.